అందుకే అందరూ ఈ రంగంలోకి వస్తున్నరు: కేటీఆర్ 

అందుకే అందరూ ఈ రంగంలోకి వస్తున్నరు: కేటీఆర్ 
  • రాజకీయాల్లో వారసత్వం ఎంట్రీ కార్డ్ మాత్రమే 
  • మన సమర్థతే మనల్ని నిలబెడ్తది 
  • ఒక్కో పేపర్​లో ఒక్కోలా వార్తలు రాస్తున్నరు 
  • సర్కార్ మంచి చేసినా వార్తలు రాస్తలేరు 
  • హిజాబ్, హలాల్​పై మాట్లాడే అధికారం 
  • ప్రభుత్వాలకు ఎక్కడిదని కామెంట్ 

హైదరాబాద్, వెలుగు: దేశంలో ఏ టాలెంట్ అవసరం లేని ఉద్యోగం ఏదైనా ఉందా అంటే.. అది రాజకీయమేనని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే పొలిటీషియన్ అవుదామని ప్రతి ఒక్కరూ ఈ ఫీల్డ్ లోకి వస్తున్నారని చెప్పారు. శనివారం హైదరాబాద్ లోని బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్, మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ‘‘తెలంగాణలో మీడియా: గతం, వర్తమానం, భవిష్యత్తు’’ అనే అంశంపై రెండ్రోజుల నేషనల్ సెమినార్‌‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మీడియాలో రోజూ ఐదు రంగాల వార్తలే ఎక్కువ వస్తుంటాయి. స్పోర్ట్స్, మూవీ స్టార్లు, బిజినెస్ మెన్, క్రిమినల్స్, రాజకీయ నాయకుల వార్తలే కనిపిస్తుంటాయి. ఈ రంగాల్లో ఏం జరుగుతోందని రీడర్లు కూడా ఆసక్తిగా చూస్తుంటారు. అయితే స్పోర్ట్స్ స్టార్ కావాలంటే టాలెంట్ కావాలి. మూవీ స్టార్ కావాలంటే లుక్స్ ఉండాలి. బిజినెస్ మెన్ కావాలంటే డబ్బు, లక్ కావాలి. క్రిమినల్ కావాలన్నా టాలెంట్ కావాలి. ఇగ ఏ టాలెంట్ అవసరం లేని ఉద్యోగమేదైనా దేశంలో ఉందంటే అది రాజకీయమే. అందుకే అందరూ ఈ రంగంలోకి వస్తున్నారు” అని కేటీఆర్ సరదాగా కామెంట్ చేశారు. 

‘‘రాజకీయాల్లో వారసత్వం అనేది ఎంట్రీ కార్డ్ మాత్రమే. మొదటి ఎన్నిక వరకే పలానా నేత కొడుకు, బిడ్డ, బిజినెస్ మెన్ అన్నది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మన సమర్థతే మనల్ని ప్రజల్లో నిలబెడుతుంది. నేను సిరిసిల్ల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైతే, ప్రతిసారీ పెరిగిన మెజార్టీనే ఇందుకు నిదర్శనం” అని అన్నారు. ఎన్నికల్లో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ను సైతం ప్రజలు ఓడించారని.. వాళ్ల కంటే తామేమీ గొప్ప కాదని తెలిపారు. 

జర్నలిస్టుల ధైర్యం గొప్పది.. 

‘‘నేను రోజూ 13 పేపర్లు చదువుతాను. ఒకే వార్తను ఒక్కో పేపర్ లో ఒక్కో విధంగా రాస్తున్నారు. అందులో ఏది నిజమో తెలుసుకోవడానికి ఇన్ని పేపర్లు చదవాల్సి వస్తోంది” అని కేటీఆర్ అన్నారు. ‘‘మీడియా సంస్థల  కంటే కూడా వాటిల్లో పనిచేసే వాళ్ల ధైర్యం గొప్పది. షోయబుల్లాఖాన్ గోల్కొండ పేపర్ ద్వారా నిజాంను ప్రశ్నించారు. తెలుగు జర్నలిజంలో సురవరం ప్రతాపరెడ్డి లాంటి కలం వీరుల నైతిక బలం గొప్పది” అని అన్నారు. ‘‘తెలంగాణ ఉద్యమం టైమ్ లో టీఆర్ఎస్ పెట్టినప్పుడు మాకు డబ్బు, మీడియా సపోర్ట్ లేదు. మన తెలంగాణ ప్రాంత జర్నలిస్టులు తామున్నామంటూ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. మీడియా మేనేజ్ మెంట్లు మనవి కాకున్నా,  వాటిల్లో పని చేసిన తెలంగాణ జర్నలిస్టులే మాకు అండగా నిలబడ్డారు. అప్పుడు మాకు నీడగా నిలిచిన చాలామంది జర్నలిస్టులకు సముచిత స్థానం ఇచ్చి ప్రభుత్వ పరంగా గౌరవించుకున్నాం” అని చెప్పారు. 

మంచి చేస్తే చూపించరా? 

‘‘రాష్ట్రం ఐటీ రంగంలో ఎంతో అభివృద్ధి చెందింది. కానీ దీనిపై ఎవరూ వార్తలు రాయరు. మంచి చేసినప్పుడు ఎందుకు చూపించడం లేదు” అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘పాల, చేపల ఉత్పత్తిలో రాష్ట్రం ముందు స్థానంలో ఉంది. ప్రభుత్వం మిషన్ భగీరథతో చెరువులను అభివృద్ధి చేసింది. దీంతో చెరువులు నిండి వ్యవసాయానికి నీళ్లు దండిగా వస్తున్నాయి. ఇవన్నీ వార్తలు కావా? చాలా రంగాల్లో ముందున్నా సర్కార్ గురించి మంచిగా రాయటం లేదు” అని అన్నారు. ‘‘చెరువుల కట్టలు తెగిపోకుండా గట్టిగా ఉండేలా చేశాం. ఇది వార్తగా రాయరు. కానీ కట్ట తెగితే మాత్రం వార్తలు రాస్తారు” అని అన్నారు. ‘‘కొందరు హలాల్, హిజాబ్ గురించి మాట్లాడుతున్నారు. ఏం తినాలి? ఏం వేసుకోవాలి? అనే దానిపై శాసిస్తున్నారు. అసలు అలా చెప్పే అధికారం ప్రభుత్వాలకు ఎక్కడిది?” అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనన్ని జర్నలిస్ట్ సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలోనే అమలవుతున్నాయని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. దేశంలోనే అత్యధిక అక్రిడిటేషన్ కార్డులు మన రాష్ర్టంలోనే ఉన్నాయని చెప్పారు. కరోనా బారినపడ్డ జర్నలిస్టులను ఆదుకున్నామని, చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు.