కేంద్రం సహకరించకున్నా మెట్రో రెండో దశ పనులు ప్రారంభిస్తాం: కేటీఆర్ 

కేంద్రం సహకరించకున్నా మెట్రో రెండో దశ పనులు ప్రారంభిస్తాం: కేటీఆర్ 

గచ్చిబౌలిలో శిల్పా లే అవుట్ ప్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 466 కోట్లతో చేపట్టిన ఈ బ్రిడ్జ్  ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,GHMC కమిషనర్ లోకేష్ కుమార్  హాజరయ్యారు. ఐటీ కారిడార్‌ను ఓఆర్ఆర్‌తో అనుసంధానం చేస్తూ రూ. 250 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్లైఓవర్ పొడవు 956 మీటర్లు కాగా,  వెడల్పు 16  మీటర్లు.  నగరంలోని ప్లైఓవర్ లలో ఇదే పొడవైనది.

ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చేపట్టిన పనుల్లో పూర్తయిన 17వ ప్రాజెక్టు. ఈ ప్లైఓవర్ తో గచ్చిబౌలి జంక్షన్ లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హైటెక్ సిటీ, నాలెడ్జ్ సెంటర్, ఫెనాన్షియల్ డ్రిస్ట్రిక్ట్‌ల మధ్య కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. ఈ మార్గం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రయాణించొచ్చు. 

జనవరి వరకు కొత్తగూడా ఫ్లైఓవర్ : కేటీఆర్ 

ఎస్‌ఆర్‌డీపీ అనే ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని మంత్రి కేటీఆర్     అన్నారు.  ఇందులో భాగంగా ఆరేండ్లలో 33 ప్రాజెక్టులు పూర్తిచేసినట్టుగా ఆయన వెల్లడించారు. హైదరాబాద్ లో ఉన్న మౌలిక సదుపాయాలు..దేశంలో ఎక్కడ లేవన్నారు. ప్రతి ఏడాది అనేక నగరాల నుండి జనం ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో MMTS విస్తరిస్తామని, కేంద్రం సహకరించకున్నా మెట్రో రెండో దశ పనులు ప్రారంభిస్తామన్నారు. జనవరి వరకు కొత్తగూడా ఫ్లై ఓవర్ అందుబాటు లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.