కేటీఆర్ మాటలు కోటలు దాటినా.. అడుగు గడప దాటలే

కేటీఆర్ మాటలు కోటలు దాటినా..  అడుగు గడప దాటలే

ఎన్నికల ప్రచారంలో కేటీఆర్​ మాటలు  కోటలు దాటుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు చదువుకున్నవారిలో ముఖ్యంగా తెలంగాణ యువతలో బహిరంగ చర్చకు దారితీస్తున్నాయి.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లకు మూడేండ్లలోనే  రైలును తీసుకొస్తానని హామీ ఇచ్చాడు. దాని గురించి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వాన్నిగానీ,  రైల్వే మంత్రినిగానీ కలవనేలేదు. అసలు ఆ ముచ్చటనే ఇంతవరకు తియ్యలేదు. ఈ మధ్య వేములవాడ  సిట్టింగ్​ అభ్యర్థికి సీటును ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించినప్పుడు కే‌టి‌ఆర్ ఆ స్థానం నుంచి పోటీ చేసి, సిరిసిల్ల స్థానాన్ని పద్మశాలి వర్గం వారికి కేటాయిస్తే బాగుండేది. ఇటువంటి కీలక సమయంలోనే రాజకీయ నాయకుల నిజస్వరూపం బయటపడుతుంది. అంటే, బయటికి మాత్రం రాజకీయంగా బీసీలు బలపడాలని అంటారు. కానీ, అటువంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం వారే రాజకీయాలు చేస్తారు. 

ప ద్మశాలీలు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంగా బలహీనమయ్యారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలకు గుర్తింపుగా, రాష్ట్రంలో పద్మశాలీలు అధికంగా ఉన్న స్థానాలను వారికే కేటాయించాలని కోరుకుంటున్నారు. అయితే, ఎన్నో తరాల నుంచి అధికారంలోనున్న అగ్రవర్ణాలవారికి తెలుసు, రాజకీయ బలం నిజానికి ఎంత శక్తిమంతమైనదో.  అందుకే వారు బీసీలకు అన్నీ ఇస్తారు. కానీ, రాజకీయ సాధికారత మాత్రం ఇవ్వరు.  

గంగవ్వతో వీడియో డ్రామా!

ఎన్నికల ప్రచారంలో ఎంతో బిజీగా ఉండే కే‌టీఆర్ ఈ మధ్య పనిగట్టుకొని గంగవ్వ  ‘మై విలేజ్ షో’ టీమ్​ని పొలాల్లో కలిసి, వారితో సరదాగా మాట్లాడుతూ, చికెన్ వండి, వడ్డించి, ఆరగించి వచ్చాడు. దాన్ని మొత్తం షూటింగ్ చేసి అప్​లోడ్​ చేశారు. దీంతో మీడియా కే‌టీ‌ఆర్​ని ఆహా- ఓహో అని చూపించాయి.  ‘సరిలేరు తనకెవరు’ అని, రాజకీయాల్లో నూతన ఒరవడి అని, నాయకుడంటే ఇలా పల్లె జనాలతో కలిసిపోవాలని బీ‌ఆర్‌ఎస్ పార్టీ వారు పొగడ్తలతో ముంచెత్తారు.  కానీ,  కే‌టీ‌ఆర్ ఈ వీడియో చేసే బదులు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి నిరుద్యోగులతో  ఇంతే సమయాన్ని వెచ్చించి వారి సమస్యలు అడిగి తెలుసుకొని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని భరోసానిస్తే ఎంతో బాగుండేది.  

మేధావులతో సమాలోచనలు చేసి రోజు రోజుకూ తీవ్రమౌతున్న నిరుద్యోగ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించి, బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పెట్టించడానికి చొరవ చూపితే ఇంకా బాగుండేది. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికన్లకే ఉద్యోగాలు’అనే స్లోగన్​తో అధికారం చేపట్టడమనేది కే‌టీఆర్​కు తెలియని విషయమా? నిరుద్యోగ సమస్య నివురుగప్పిన నిప్పు లాంటిది. దాన్ని తక్కువగా అంచనా వేయడం చాలా పెద్ద తప్పు.  

రాహుల్, కేటీఆర్​ భిన్న ధ్రువాలు

 యూ‌పీ‌ఏ హయాంలో సోనియా గాంధీ ప్రధాన మంత్రి పదవిని త్యజించడమే కాకుండా, తన కొడుకు రాహుల్ ​గాంధీని కూడా మంత్రిని చేయలేదు. తెలంగాణ ఏర్పాటైతే దళితుడే ముఖ్యమంత్రి అని పదే పదే చెప్పిన కే‌సీఆర్ యావత్ తెలంగాణ సమాజాన్ని, దళిత వర్గాన్ని మోసం చేసి తను ముఖ్యమంత్రిగా, తన కొడుకును మంత్రిగా చేసి అధికారాన్ని అనుభవిస్తున్నాడు. రాహుల్ గాంధీ, కే‌టీఆర్ ఇద్దరూ కుటుంబ -వారసత్వ నేపథ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ వారిద్దరూ భిన్న ధ్రువాలు. వారు వాడే భాష, అధికారం పట్ల ఆపేక్ష  వేర్వేరుగా ఉన్నాయి.  


కేంద్రంపై నిందలు వేయడమే కార్యాచరణగా పెట్టుకున్న కేసీఆర్,​ తెలంగాణను అభివృద్ధిలో ముందుకు నడిపించలేకపోయాడు. కే‌సీ‌ఆర్ ‘తెలంగాణ మోడల్’ అన్ని రాష్ట్రాల్లో రావాలంటున్నాడు.  కేసీఆర్ చేసిన మోడల్​ఏమిటో టీఎస్పీఎస్సీ నిర్వాకమే తెలియజేస్తున్నది.  మరోవైపు బీఆర్ఎస్​ మళ్ళీ అధికారంలోకి వస్తే  టీఎస్పీఎస్సీను కే‌టీఆర్ ప్రక్షాళన చేస్తాననడం హాస్యాస్పదంగా ఉంది. లక్షల కోట్లు కుమ్మరించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగితే అది చాలా చిన్న విషయం అయినట్టు సన్నాయి నొక్కులు నొక్కారు.  తెలంగాణ యువతను పట్టిపీడుస్తున్న నిరుద్యోగ సమస్యను పట్టించుకోకుండా కేవలం అధికారం కోసం ‘ఓట్లు- సీట్లు’ మంత్రాన్నే జపిస్తే ఓటర్లు ఊరుకోరు. 

జనార్దన్