ఆరు దశాబ్దాలు ఏం చేయనోళ్లు.. 6 గ్యారెంటీలని డైలాగ్లు కొడుతున్నరు: మంత్రి కేటీఆర్

ఆరు దశాబ్దాలు ఏం చేయనోళ్లు.. 6 గ్యారెంటీలని డైలాగ్లు కొడుతున్నరు:  మంత్రి కేటీఆర్

6 దశాబ్దాలు ఏం చేయనోళ్లు.. 6 గ్యారెంటీలు అని డైలాగ్ లు కొడుతున్నారని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. రాజకీయం కోసం ఢిల్లీలో చుట్టూ పైరవీలు చేసే వాళ్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్లలో చేయాని పనిని బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో చేసి చూపెడుతుందన్నారు.

24 గంటల కరెంట్ ఇవ్వాలన్నా ఆలోచన కాంగ్రెస్ కు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తీగలు పట్టుకుంటే కరెంట్ వస్తుందో లేదో కాంగ్రెస్ నేతలకు తెలుస్తదని మంత్రి కేటీఆర్ అన్నారు.

మంచిర్యాల జిల్లాలో రూ. 313 కోట్ల వ్యయంతో  చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. చెన్నూరు అభివృద్ధిలో సిద్దిపేటతో పోటీపడుతోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని.. చెన్నూరు అభివృద్ధిని కూడా గమనించాలని తెలిపారు. త్వరలో చెన్నూరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.


పామాయిల్ ఫ్యాక్టరీతో స్థానిక రైతులకు ప్రయోజనం ఉంటుందని.. 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని మంత్రి ప్రకటించారు. పక్క దేశాల నుంచి ఆయిల్ దిగుమతి తగ్గించాలన్నదే మన టార్గెట్ అని వివరించారు. పామాయిల్ ద్వారా లాభాలున్నాయని రైతులే చెప్తున్నారని ఆయన అన్నారు.