
టాలెంట్ లేకుండా రాజకీయాల్లో రాణించలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్ లో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారసత్వాన్ని ప్రస్తావించిన కేటీఆర్.. వారసత్వంతో రాజకీయాల్లో రాణించవచ్చనే కొందరి భావన తప్పని అన్నారు. వారసత్వం రాజకీయాల్లోకి ఎంట్రీకే పనికొస్తుందన్న కేటీఆర్.. ప్రతిభను నిరూపించుకోకపోతే ఏ ఒక్కరూ కూడా రాజకీయాల్లో రాణించలేరన్నారు. సొంతంగా నిరూపించుకోకపోతే వారసత్వ నాయకుడిని ప్రజలు తిరస్కరిస్తారన్నారని కేటీఆర్ అన్నారు. ఇందిరా గాంధీ వంటి నేతలనే ప్రజలు ఓడించారన్నారు.
తన పనితీరు వల్లే సిరిసిల్లలో మెజారిటీ పెరిగిందన్న కేటీఆర్.. పనిచేయకపోతే సిరిసిల్ల ప్రజలు ఎప్పుడో తనను పక్కన పెట్టేవారన్నారు. తెలంగాణ ఉద్యమంలో మీడియా మిత్రుల పోరాటం మరువలేనిదన్నారు. జర్నలిస్టులకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామన్నారు. పేపర్ లో వచ్చే వార్తల్లో ఏది నిజమో ఏదీ అబద్దమో తెలియని పరిస్థితి ఉందన్నారు. సక్రాంతి తర్వాత మీడియా భవన్ నిర్మిస్తామని కేటీఆర్ అన్నారు.