మీరు ఇటుకతో కొడితే..మేం రాయితో: కేటీఆర్

మీరు ఇటుకతో కొడితే..మేం రాయితో: కేటీఆర్
  •                 ఆరునెలల్లో కరెంటు సమస్యను పరిష్కరించాం
  •                 19 కంపెనీల భూకేటాయింపులను క్యాన్సిల్‌ చేశాం
  •                 దివాలా తీసింది పరిశ్రమలు కాదు.. కాంగ్రెస్‌ పార్టీ
  •                  అసెంబ్లీలో పద్దులపై చర్చలో మంత్రి

ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఉమ్మడి ఏపీలో కరెంట్ లేక సబ్‌స్టేషన్ల మీద రైతులు దాడులు చేసి, కేసుల పాలైన సందర్భాలు అనేకం ఉన్నాయని మంత్రి కేటీఆర్​ అన్నారు. గత ప్రభుత్వాలు ఆరు దశాబ్దాల్లో పరిష్కరించలేని కరెంట్‌ సమస్యను తాము ఆరునెలల్లోనే పరిష్కరించామని చెప్పారు. ‘‘రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఏం చేయలేదని అనడం సరికాదు. మీరు ఇటుకతో కొడితే.. మాకు రాయితో కొట్టే తెలివి ఉంది” అని హెచ్చరించారు.  అసెంబ్లీలో ఐటీ, ఇండస్ట్రీస్‌, కామర్స్‌ పద్దులపై శుక్రవారం జరిగిన చర్చలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  చేసిన డిమాండ్లపై కేటీఆర్‌  మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో భూసంతర్పణలు చేసి పోయారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఎవరికెన్ని భూములు ఇచ్చారో సమీక్షించి..  19 కంపెనీలకు  భూకేటాయింపులను క్యాన్సిల్‌ చేశామని తెలిపారు. ఆ భూములను పొందినవాళ్లు రియల్‌ ఎస్టేట్‌కు ఉపయోగించుకుందామని అనుకున్నారేమోనని, అందుకే తాము అధికారంలోకి వచ్చాక 1,234  ఎకరాల భూములను వాపస్‌ తీసుకున్నట్లు చెప్పారు. ఈ భూములను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ‘‘తెలంగాణ వచ్చినంక పరిశ్రమలు దివాలా తీశాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. దివాలా తీసింది పరిశ్రమలు కాదు.. నిరంతర కరెంట్​తో ఇన్వర్టర్లు, జనరేటర్ల కంపెనీలు, కాంగ్రెస్‌ పార్టీ దివాలా తీశాయి” అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం గురించి చెబితే కాంగ్రెస్​వాళ్లకు ఎందుకో పాపం కడుపు మండుతున్నదని ఆయన విమర్శించారు.

బిల్ట్​, సిర్పూర్​ పేపర్​ మిల్​ను తెరిపిస్తాం

బిల్ట్‌ పరిశ్రమను తెరిపించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, సీతక్క చేసిన డిమాండ్‌పై మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ బిల్ట్‌ మూతపడిన మాట వాస్తవమేనని, ఎవరి హయాంలో మూతపడిందని ప్రశ్నించారు. మూత మీరు వేస్తే తాము తెరిపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దీంతోపాటు సిర్పూర్‌ పేపర్‌ మిల్‌ను తెరిపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

నాలుగు విప్లవాలు మా లక్ష్యం

హరిత విప్లవం, నీలి విప్లవ(చేపలు), గులాబీ విప్లవం(మాంసం), శ్వేత విప్లవం(డెయిరీ) తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్​ వెల్లడించారు. రాష్ట్రంలో ఫుడ్‌ మ్యాప్‌ తయారు చేస్తున్నామని,  గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో 435 ఎకరాల్లో 360 యూనిట్ల ప్రారంభించబోతున్నామని, దీని ద్వారా ప్రత్యక్షంగా 12 వేల మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. టీఎస్‌పీసీబీ, టీఎస్‌ఐఐసీ కలిసి అధ్యయనం చేసి 1,766 పరిశ్రమలను కాలుష్య కారక పరిశ్రమలను గుర్తించాయని, బూచినెల్లి, ఇంద్రకరణ్, రాకంచర్లకు ఈ పరిశ్రమలను తరలించాలని నిర్ణయించామని చెప్పారు.

కేటీఆర్‌ వర్సెస్‌ రాజగోపాల్‌రెడ్డి

అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ తన ప్రసంగంలో ‘‘రాజగోపాల్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ఆయనే కన్ఫ్యుజన్‌లో ఉన్నారు’’ అని అన్నారు. మంత్రి స్పీచ్‌ ముగిసిన తర్వాత రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా పార్టీ వాళ్లను మీ పార్టీలోకి తీసుకున్నప్పుడు ఏం బాధ లేదా? పార్టీలోకి చేర్చుకొని వెంబట కూర్చుబెట్టుకొని మంత్రి పదవులు ఇచ్చిండ్రు కదా. ఏ పార్టీ అయితే ఏమైంది? మీకంటే ఎక్కువగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది ఎవరు? రాజకీయాలను తెలంగాణలో భ్రష్టుపట్టించింది ఎవరని అడిగితే ప్రజలే చెప్తరు. మంత్రి అనవసరంగా నన్ను ఏ పార్టీ అని అడుగుతున్నరు. ఈ పార్టీల గెలిచినోళ్లను ఆ పార్టీలకు ఎందుకు చేర్చుకున్నరు” అని మండిపడ్డారు. దీంతో మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. ‘‘మిత్రులు పద్దు మీద, పరిశ్రమల మాట్లాడుతారనుకుంటే.. రాజగోపాల్ రెడ్డిగారికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది” అని విమర్శించారు. ‘‘2004లో 26 మంది టీఆర్‌ఎస్‌  నుంచి గెలిస్తే పది మందిని కలుపుకున్నది మీ పార్టీ వాళ్లు కాదా? రెండు రోజుల క్రితం రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ అక్కడి బీఎస్పీ పక్ష ఎమ్మెల్యేలందరిని కాంగ్రెస్‌లో విలీనం చేసుకున్నప్పుడు అది ప్రజాస్వామ్యం అయితది.. ఇక్కడిది అప్రజాస్వామ్యం అయితదా.. వారికో నీతి.. మాకో నీతా” అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే, స్పీకర్‌ నిర్ణయం తప్పయితే కోర్టుకు వెళ్లండని కేటీఆర్​ సూచించారు.

కరెంట్​లో మీ గొప్పతనమేంది?: భట్టి

తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను పరిష్కరించామన్న మంత్రి కేటీఆర్​ వ్యాఖ్యలపై కాంగ్రెస్​ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. ‘‘కరెంట్‌ ఇవ్వడానికి మీరు ఆరునెలల్లోనే  ఏమైనా  ప్రాజెక్టులు స్టార్ట్‌ చేసి ఉత్పత్తి చేశారా? కరెంట్‌ విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ గొప్పతనం ఏమీ లేదు. తెలంగాణకు ఎక్కువగా కరెంట్‌ ఇచ్చేలా విభజన చట్టంలోనే యూపీఏ ప్రభుత్వం పేర్కొంది. అంతకుముందే కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్లాంట్లు పూర్తి కావడం కలిసొచ్చింది. రాష్ట్రం ఏర్పాటయ్యాక చేపట్టిన భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్లు ఇప్పటి దాకా ప్రారంభంకాలేద”న్నారు. ఈ ప్రభుత్వం ఇసుకను కమర్షియల్ గా మార్చేసిం దని, ఇష్టమైన వ్యక్తు లకు అప్పగిచ్చి తవ్వుకోమంటోందని దుయ్యబట్టారు .