
డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులందరికీ పంచాలని డిమాండ్ చేస్తూ మంత్రి మల్లారెడ్డి ఎదుట నిరసనకారులు ఆందోళన చేశారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్పేట మండలం బొమ్మరాసిపేట గ్రామపంచాయతీ పరిధిలో నిర్మించిన 380 డబుల్ బెడ్రూంల పంపిణీకి సెప్టెంబర్6న మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు.
ఆయన పట్టాలు పంపిణీ చేస్తుండగా నిరసనకారులు ఒక్క సారి సభా ప్రాంగణానికి చొచ్చుకొచ్చారు. పోలీసులు గమనించి వారిని అడ్డుకున్నారు. మంత్రి మాట్లాడుతుండగా అర్హులందరికీ ఒకే సారి ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read ; లంచం ఇస్తేనే ఇంక్రిమెంట్లు... ఆదిలాబాద్ రిమ్స్లో స్టాఫ్ నర్సుల నుంచి వసూళ్లు
ప్రస్తుతానికి కొందరికే ఇళ్లు కేటాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి నిరసనకారలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిగా వారు మల్లారెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
దీంతో ఆ ప్రాంతంలో వాతావరణం వేడెక్కింది. మంత్రితో గ్రామస్థులు మాట్లాడుతుండగా తుర్కపల్లి సీఐ రాజగోపాల్రెడ్డి గ్రామస్థులను నెట్టివేశాడని పలువురు ఆరోపించారు.
నిరసనల్లో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్దన్రెడ్డిపై మంత్రి చిందులు తొక్కారు. ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు తరలించారు. చివరికి అందరికీ వచ్చే మంగళవారం రోజు పట్టాలు పంపిణీ చేస్తామని మంత్రి చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.