మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా

మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా

కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన పదవి నుంచి తప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం నఖ్వీ రాజీనామా నిర్ణయం ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడైన ఆయన పదవీకాలం గురువారంతో ముగియనుంది. అయితే త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున నఖ్వీ పేరును ప్రతిపాదించలేదు. ప్రస్తుత కేంద్రమంత్రుల్లో నఖ్వీ, రాజ్ నాథ్ సింగ్ మాత్రమే అటల్ బిహారీ వాజ్ పేయితో పాటు మోడీ కేబినెట్లో సభ్యులుగా ఉన్నారు. 

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మైనార్టీ నేతకు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టాలని ఎన్డీఏ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండో అతిపెద్ద రాజ్యాంగ పదవికి ముస్లింను ఎంపిక చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా.. జులై 19 వరకు నామినేషన్ వేసేందుకు గడువు ఉంది. నఖ్వీతో పాటు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేంద్ర మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లా, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ పేర్లు సైతం ఉపరాష్ట్రపతి రేసులో వినిపిస్తున్నాయి.