కంటి వెలుగును వైద్య సిబ్బంది పక్కాగా నిర్వహించాలె

కంటి వెలుగును వైద్య సిబ్బంది పక్కాగా నిర్వహించాలె

గద్వాల, వెలుగు:  వైద్య సిబ్బంది స్థానికంగానే ఉంటూ కంటి వెలుగు ప్రోగ్రామ్‌‌ను పక్కాగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి ఆదేశించారు.  మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్‌‌లో కంటి వెలుగు ప్రోగ్రాంపై ఎంపీ రాములు, జడ్పీ చైర్‌‌‌‌పర్సన్‌‌ సరిత, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18 నుంచి ప్రారంభంకానున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని గద్వాల జిల్లాలో 255 గ్రామాలు, 87 వార్డుల్లో నిర్వహిస్తామన్నారు.  18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి టెస్టులు చేసి..  చూపు తక్కువ ఉన్న వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. అవసమైన వారికి ఆపరేషన్లు కూడా చేయిస్తామన్నారు.  అన్ని శాఖల అధికారులు, ఎమ్మెల్యే నుంచి వార్డు మెంబర్‌‌‌‌ వరకు ప్రజాప్రతినిధులు భాగస్వాములై ఈ ప్రోగ్రామ్‌‌ను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.  

మినిట్స్‌‌లో ప్రసంగం ఎందుకు లేదు

అనంతరం ఎంపీ రాములు మాట్లాడుతూ మినిట్స్‌‌లో తన ప్రసంగం ఎందుకు లేదని వైద్యారోగ్య అధికారులను ప్రశ్నించారు.  ఎంపీ ప్రసంగాన్నే  చేర్చకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని హితవు పలికారు. కంటివెలుగును అందరం కలిసికట్టుగా సక్సెస్ చేద్దామని అన్నారు. 

కళ్లను దానం చేస్తా

కంటి వెలుగు స్ఫూర్తిగా తీసుకొని తాను కళ్లు దానం చేస్తానని, ఇందుకు సంబంధించిన తన పుట్టిన రోజున ప్రకటన చేస్తానని జడ్పీ చైర్‌‌‌‌పర్సన్‌‌ సరిత చెప్పారు. బతికి ఉన్నప్పుడు రక్తదానం, చనిపోయాక నేత్రదానం చేసేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహన్, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, డీఎంహెచ్‌‌వో శశికళ పాల్గొన్నారు

మెట్‌‌పల్లి మినీ లిఫ్ట్‌‌ ప్రారంభం

వనపర్తి, వెలుగు: ఎత్తిపోతల పథకాల్లో వనపర్తి జిల్లా రాష్ట్రంలోనే టాప్‌‌లో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌ రెడ్డి చెప్పారు.  మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని మెట్‌‌పల్లి వద్ద మినీ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లిఫ్ట్‌‌ ద్వారా మెట్ పల్లి, రంగంగడ్డ, నందిమల్ల గడ్డ, మేగ్యాతండాల్లో 2 వేల ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీరు అందుతుందన్నారు.  కేఎల్‌‌ఐ ద్వారా  ఈదుల చెరువు నింపి అక్కడి నుంచి రూ.92 లక్షలతో మినీ లిఫ్ట్ ఏర్పాటు చేశామని చెప్పారు.  గ్రావిటీ ద్వారా  నీళ్లు ఎక్కని  ప్రాంతాలకు లిఫ్ట్‌‌ ద్వారా తరలిస్తున్నామని వివరించారు.  ఎంపీ, ఎమ్మెల్సీలు, సీఎస్ఆర్ నిధులతో పాటు తన సొంత నిధులను కూడా లిఫ్ట్‌‌ కోసం వెచ్చిస్తున్నామన్నారు.  వనపర్తి నియోజకవర్గంలో 65 లిఫ్ట్‌‌లు ఏర్పాటు చేసి.. రికార్డు సృష్టించామని సంతోషం వ్యక్తం చేశారు.