అటువంటి వాహనాలపై GST తగ్గించాలి: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

అటువంటి వాహనాలపై GST తగ్గించాలి: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆధారిత వాహనాలపై జీఎస్టీ(GST)ని తగ్గించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. ఈ తరహా వాహనాలపై జీఎస్టీని 12 శాతానికి పరిమితం చేయాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రులను ఆయన కోరారు.

IFGE నిర్వహించిన ఇండియా బయో-ఎనర్జీ & టెక్ ఎక్స్‌పోలో పాల్గొన్న గడ్కరీ.. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికలను తీసుకురావాలని సూచించారు. టాటా, సుజుకి, టయోటా వంటి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు దేశంలో ఫ్లెక్స్ ఇంజన్ కార్లను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటికి అదనంగా ద్విచక్ర వాహన తయారీ కంపెనీలైన బజాజ్, టీవీఎస్ సంస్థలు 100 శాతం ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్ ఇంజిన్‌ మోడళ్లపై దృష్టి సారించాయని పేర్కొన్నారు. 

ప్రత్యేకంగా సెకండ్ హ్యాండ్ వాహనాలను ఉపయోగించే యాత్రికులు, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచనలను చేయాలని కేంద్రమంత్రి.. రాష్ట్రాలకు సూచించారు. దేశంలోని మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తున్న విషయాన్ని ఆయన హైలైట్ చేశారు. 

యోగి మాట విన్నారు

ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ వాహనాలపై జీఎస్టీని తగ్గించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అభ్యర్థించినట్లు గడ్కరీ వెల్లడించారు. ఆయన అభ్యర్థనను అనుసరించి యూపీ ప్రభుత్వం అటువంటి వాహనాలపై పన్నులను తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా ఆ దిశగా పన్ను తగ్గింపులను పరిశీలించాలని ఆయన కోరారు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలంటే ఏవి..?

ఒకటి కంటే ఎక్కువ ఇంధన రకాలతో నడిస్తే వాటిని ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలు అంటారు. సాధారణంగా పెట్రోల్‌+ ఇథనాల్‌, మిథనాల్‌తో వంటి ఇంధనాలతో వీటిని నడపొచ్చు.