కాళేశ్వరం డిజైనర్ అసెంబ్లీకి ఎందుకొస్తలేడు? : పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి

కాళేశ్వరం డిజైనర్ అసెంబ్లీకి ఎందుకొస్తలేడు? : పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి
  • కేసీఆర్‌‌‌‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి ఫైర్​
  • అధికారంలో ఉన్నప్పుడు దేవాలయం, ఇప్పుడు బొందల గడ్డ ఎట్లైంది?  
  • ప్రాజెక్టు ఎందుకు కుంగిందో సభకు వచ్చి కేసీఆర్​ వివరించాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే రూపశిల్పి, డిజైనర్‌‌‌‌‌‌‌‌ను అని చెప్పుకున్న కేసీఆర్, ఆ ప్రాజెక్టు గురించి చర్చ జరుగుతుంటే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన వచ్చి కుంగిన బ్యారేజీని ఎలా రిపేర్ చేయాలో, బ్యారేజీ అసలు ఎందుకు కుంగిందో సభకు వివరించాలన్నారు. శనివారం అసెంబ్లీలో ఇరిగేషన్‌‌‌‌ శ్వేతపత్రంపై జరిగిన చర్చలో పొంగులేటి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను తొందరగా కట్టాలన్న ఆతృత తప్ప, ప్రాజెక్టుల నాణ్యత గురించి అసలు పట్టించుకోలేదన్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే రూపశిల్పి అని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారని పొంగులేటి గుర్తు చేశారు. 

అలాంటి భారీ ప్రాజెక్టుల రూపశిల్పి ఇరిగేషన్‌‌‌‌పై చర్చ జరుగుతున్నప్పుడు సభకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ ఒక దేవాలయం అని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ పలుమార్లు చెప్పుకొచ్చిండు. ఇటీవల మేము మేడిగడ్డ పర్యటనకు వెళ్తే బొందలగడ్డకు వెళ్లారా అని మాట్లాడుతున్నడు. అధికారంలో ఉన్నప్పుడు దేవాలయం, అధికారం పోగానే బొందల గడ్డ ఎట్ల అయ్యిందో చెప్పాలి” అని పొంగులేటి ప్రశ్నించారు. ఇప్పటికీ మేడిగడ్డ బ్యారేజీలో నీటిని ఎత్తిపోయొచ్చునని నల్గొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కుంగింది. 

బ్యారేజీ కుంగిన తర్వాత 45 రోజులు వాళ్లే అధికారంలో ఉన్నారు. అప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్‌‌‌‌లోని నీటిని ఎత్తిపోయకుండా, ఎందుకు వృథాగా వదిలేశారు? అప్పుడు నీళ్లు రిజర్వాయర్లలో ఎత్తిపోస్తే, ఇప్పుడు రైతులకు నీళ్లు వచ్చేవి కదా?” అని పొంగులేటి ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని ఆయన విమర్శించారు. కొత్త ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు లేదని, కేవలం సలహాలు ఇచ్చే హక్కు మాత్రమే ఉందన్నారు. చేవెళ్ల ప్రాజెక్టుకు పేరు మార్చడమే శాపంగా పరిణమించిందన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పును  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు ఒప్పుకోవాలని సూచించారు. మహారాష్ట్ర వైపు బ్యారేజీ గతంలోనే అడుగున్నర కుంగిందని, అయినా అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్ పట్టించుకోలేదని పొంగులేటి ఆరోపించారు. అప్పుడే పట్టించుకొని చర్యలు తీసుకుని ఉండుంటే, ఇప్పుడు మరో మూడు పిల్లర్లు కుంగేవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అసలు బ్యారేజీ పనికివస్తుందో లేదో కూడా చూడాల్సి ఉందన్నారు.