మే మొదటి వారంలో 28 జిల్లాల్లో భూభారతి

మే మొదటి వారంలో 28 జిల్లాల్లో భూభారతి
  • ఇందిరమ్మ ఇండ్లు, భూభారతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
  • ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ గడువు మళ్లీ పొడిగించే ఆలోచన లేదు
  • కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌లో మాట్లాడిన మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు : కలెక్టర్లు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి చట్టం అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని  మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే నాలుగు పైలట్‌‌ మండలాల్లో భూభారతి ప్రారంభించగా 5,905 అప్లికేషన్లు వచ్చాయని, మే మొదటి వారంలో 28 జిల్లాల్లో పైలట్‌‌ ప్రాజెక్ట్‌‌ ప్రారంభం అవుతుందని తెలిపారు. మంగళవారం చీఫ్‌‌ సెక్రటరీ శాంతికుమారితో కలిసి సెక్రటేరియట్‌‌ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూభారతి చట్టం అమలు కలెక్టర్ల బాధ్యత అని, దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. పైలట్‌‌ మండలాలుగా తీసుకున్న నేలకొండపల్లిలో 1,076 సమస్యలు రాగా -మద్దూర్‌‌లో 233, -లింగంపేటలో 810,  -వెంకటాపురంలో 3,786 అప్లికేషన్లు వచ్చాయన్నారు.

ఈ మండలాల్లో 30వ తేదీలోగా రెవెన్యూ సదస్సులు పూర్తి చేయాలని, మే మొదటి వారంలో 28 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని ఎంపిక చేసి భూభారతి ప్రారంభిస్తామన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మే మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున కేటాయించి, ప్రతి 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించి అర్హులను ఎంపిక చేయాలని చెప్పారు. ఇండ్లను 400, 600 స్వ్కేర్‌‌ ఫీట్ల మధ్య నిర్మిస్తేనే నిధులు విడుదల అవుతాయన్నారు. ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని చెప్పారు.

స్టీల్, సిమెంట్‌‌ తక్కువ ధరకు అందేలా చూసేందుకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌‌బాబుతో సమావేశం నిర్వహిస్తామన్నారు. 11 జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక సరిగాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ గడువు ఈ నెల 30తో ముగుస్తుందని, మరోసారి పొడిగించే ఆలోచన లేదన్నారు. సమావేశంలో స్టాంప్స్‌‌ అండ్‌‌ రిజిస్ట్రేషన్స్‌‌ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్‌‌, ఎంఏయూడీ కార్యదర్శి దానకిశోర్, హౌసింగ్ ఎండీ వీపీ.గౌతమ్‌‌, సీసీఎల్‌‌ఏ డైరెక్టర్‌‌ మకరంద్‌‌ పాల్గొన్నారు.

పేదలకు ఇందిరమ్మ పట్టాలిస్తాం

యాదాద్రి, వెలుగు : ‘ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం.. మా ప్రభుత్వంలో పేదలకు భూములు పంచుతాం.. గ్రామాల్లో ప్రభుత్వ భూమిని సాగు చేసుకునే అర్హులైన వారికి పట్టాలు ఇస్తాం’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా వలిగొండలో మంగళవారం జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. గత పాలకులు నాలుగు గోడల మధ్య, నలుగురు వ్యక్తులు కలిసి ధరణి చట్టాన్ని రూపొందించారని విమర్శించారు.

ఆ చట్టానికి విధి విధానాలే లేవని, అప్పటి సీఎం మాటే విధి విధానాలుగా చలామణి అయ్యాయని ఎద్దేవా చేశారు. చెప్పిన పని చేయలేదన్న కోపంతో రాత్రికి రాత్రే వీఆర్‌‌వో, వీఆర్‌‌ఏ వ్యవస్థను రద్దు చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం అందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకొని భూభారతి చట్టాన్ని రూపొందించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూమి లేకున్నా.. రైతుబంధు కోసం పాస్‌‌బుక్స్‌‌ తీసుకున్నారన్నారు.

భూసంబంధిత సమస్యలన్నింటికీ ప్రస్తుత భూభారతి పరిష్కారం చూపుతుందన్నారు. మే 1 నుంచి ప్రతీ జిల్లాలో ఒక మండలాన్ని పైలట్‌‌ ప్రాజెక్ట్‌‌గా ఎంపిక చేసి భూభారతి చట్టాన్ని అమలు చేస్తామని, అక్కడ ఎదురయ్యే సమస్యలను తెలుసుకొని చట్టంలో మార్పులు, చేర్పులు చేస్తామని చెప్పారు. రెవెన్యూ, ఫారెస్ట్, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో ఇండ్లు ఇస్తామని మాయమాటలు చెప్పి పట్టించుకోలేదని.. తాము మాత్రం మొదటి విడతలోనే 4.50 లక్షల ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు.

శిథిలావస్థకు చేరిన తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌లను గుర్తించి రిపోర్ట్‌‌ ఇవ్వాలని ఆదేశించారు. కాగా రైతులు సరళ, నర్సింహులు, నర్సిరెడ్డి తమ భూములకు సంబంధించిన సమస్యలను మంత్రికి వివరించగా.. వాటిని త్వరగా పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు. సదస్సులో ఎంపీ చామల కిరణ్‌‌కుమార్‌‌రెడ్డి, ప్రభుత్వ విప్‌‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌‌కుమార్‌‌రెడ్డి, వేముల వీరేశం, కలెక్టర్‌‌ హనుమంతరావు, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ వీరారెడ్డి, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌‌రెడ్డి పాల్గొన్నారు.