జీ ప్లస్ 3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు..నివాసం ఉన్న చోటే నిర్మాణాలు

జీ ప్లస్ 3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు..నివాసం ఉన్న చోటే నిర్మాణాలు
  •     పట్టణ ప్రాంతాల్లోని అర్హులకు కేటాయిస్తాం: పొంగులేటి
  •     నివాసం ఉన్న చోటే నిర్మాణాలు
  •     జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు
  •     జాగాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని 4 జిల్లాల కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో మొద‌‌‌‌టి ద‌‌‌‌శ ఇందిర‌‌‌‌మ్మ ఇండ్ల ప్రక్రియ కొలిక్కి వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ప‌‌‌‌ట్టణ ప్రాంతాల్లోని ఇందిర‌‌‌‌మ్మ ఇండ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. అర్హుల జీవ‌‌‌‌నోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివాసం ఉంటున్న చోటే జీ+3 పద్ధతిలో ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైన కార్యాచ‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌ను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పట్టణాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సెకట్రేరియెట్​లో మంగళవారం మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ‘‘పట్టణాల్లోని మురికివాడల్లో జీవనం సాగిస్తున్న పేదలు.. అక్కడే నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్​కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. నివాసం ఉంటున్న చోటే జీ+3 పద్ధతిలో ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు వీలుగా స్థలాలు గుర్తించాలి’’అని మంత్రి పొంగులేటి అన్నారు.

భూదాన్​ భూములు గుర్తించాలి

భూదాన్ భూముల‌‌‌‌ను పేద‌‌‌‌ల ఇండ్ల కోసం వినియోగించే వెసులుబాటు ఉందని, అలాంటి ల్యాండ్​లను గుర్తించి సాధ్యమైనంత త్వర‌‌‌‌గా నివేదిక ఇవ్వాల‌‌‌‌ని కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశించారు.  జీహెచ్​ఎంసీ పరిధిలో 166 మురికివాడలు ఉన్నాయని, ఇక్కడ సుమారు 42వేల మంది నివాసం ఉంటున్నార తెలిపారు. జీ ప్లస్ 3 పద్ధతిలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మించవచ్చనే అంశాలపై ఈ నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.   ఈ సందర్భంగా హౌసింగ్ కాల‌‌‌‌నీస్ ఇన్స్‌‌‌‌పెక్షన్ యాప్‌‌‌‌ను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. స‌‌‌‌మావేశంలో హౌసింగ్ సెక్రట‌‌‌‌రీ వీపీ గౌత‌‌‌‌మ్‌‌‌‌, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ క‌‌‌‌ర్ణన్, కలెక్టర్లు నారాయణ రెడ్డి, హరిచందన, మనుచౌదరి, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు పాల్గొన్నారు.

30లోగా అసైన్డ్ ల్యాండ్ లబ్ధిదారుల వివరాలివ్వండి

భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి.. పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లోని అసైన్డ్ ల్యాండ్, లబ్ధిదారుల వివరాలను ఈ నెల 30వ తేదీలోగా ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. మంగళవారం సెక్రటేరియెట్​లోని చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసినప్పుడే దాని ఫలితాలు సామాన్యులకు అందుతాయని అన్నారు.

 మూడు  దఫాలుగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో సామాన్యులను, ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని, సస్పెండ్ చేయడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు.  రెవెన్యూ సదస్సుల్లో 8.65 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఇందులో ప్రధానంగా సాదాబైనామా, సర్వే నంబర్ మిస్సింగ్, అసైన్డ్ ల్యాండ్, అసైన్డ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్, సక్సెషన్‌‌‌‌కు సంబంధించి సుమారు 6 లక్షల దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. వీటిని ఐదు విభాగాలుగా విభజించి, ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలన జరిపి ఆగస్టు 15వ తేదీలోగా వీలైనన్ని సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సాదాబైనామాల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు తీర్పు కోసం వేచిచూడకుండా దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం కోసం సిద్ధం చేసుకోవాలన్నారు. 

దరఖాస్తులు ఇష్టం వచ్చిన రీతిలో తిరస్కరించొద్దు

దరఖాస్తుల సంఖ్యను తగ్గించుకోవడానికి ఇష్టం వచ్చిన రీతిలో తిరస్కరించకూడదని, తిరస్కారానికి గల కారణాలను లిఖితపూర్వకంగా దరఖాస్తుదారునికి తెలియజేయాలని మంత్రి సూచించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా జీపీఓలకు, జేఎన్​టీయూ ఆధ్వర్యంలో లైసెన్స్‌‌‌‌డ్ సర్వేయర్లకు పరీక్ష నిర్వహిస్తున్నామని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకొని పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, ధరలు, చెల్లింపులు, ఇసుక, సిమెంట్, స్టీల్ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఏ సమస్యా రాకుండా చూడాలని, అలాగే ధరల నియంత్రణ కమిటీ చురుగ్గా పనిచేసేలా కలెక్టర్లు నిత్యం పర్యవేక్షించాలన్నారు. 

బేస్‌‌‌‌మెంట్ నిర్మాణం కోసం అక్కడక్కడా అందుబాటులో ఉన్న మట్టిని తీసుకెళ్తున్న లబ్ధిదారులపై పోలీసులు కేసులు నమోదు చేయడం సరైన చర్య కాదని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ప్రతీ సోమవారం చెల్లింపులు జరుపుతున్నామని.. సాంకేతిక సమస్యలతో కొంతమంది లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కావడం లేదని, ఇటువంటి సమస్యలను ముందుగానే గుర్తించి లబ్ధిదారునికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. డబుల్​బెడ్రూం ఇండ్లకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని మంత్రి ఆదేశించారు.