బీజేపీతో టచ్​లోకి వెళ్లా అనేది.. ఉత్త ప్రచారమే : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

బీజేపీతో టచ్​లోకి వెళ్లా అనేది.. ఉత్త ప్రచారమే : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  •     ఎంపీ ఎన్నికల తర్వాత సీఎం అనేది కూడా ఊహాజనితమే
  •     మీడియాతో చిట్​చాట్​లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  •     సీఎంతో రోజూ కనిపిస్తే ప్రభుత్వంలో నంబర్ 2 అవుతారా?
  •     ధరణిలో జరిగిన అవినీతిపై వైట్​పేపర్ రిలీజ్ చేస్తం
  •     జోగినపల్లి సంతోష్ ఒక్కరే కాదు.. అవినీతిపరుల లిస్ట్ పెద్దగానే ఉన్నది
  •     ఏ స్థాయిలో ఉన్నా.. వదిలే ప్రసక్తే లేదని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల తర్వాత తాను సీఎం అవుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీజేపీ, మరే పార్టీతో తాను టచ్​లోకి వెళ్లలేదని, అదంతా ఉత్త ప్రచారమే అని కొట్టిపారేశారు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయని.. తన దగ్గర పండ్లు ఉన్నాయనే కొందరు రాళ్లు వేస్తున్నారని అన్నారు. 

కొన్నిసార్లు నిప్పు పెట్టి పొగ వచ్చేలా చేస్తారని వ్యాఖ్యానించారు. గురువారం హైదరాబాద్​లోని బేగంపేట హరిత ప్లాజాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మీడియాతో చిట్​చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ప్రభుత్వంలో నేను నంబర్ 2 కాదు.. రోజూ సీఎం రేవంత్ వెంట ఉంటే నంబర్ 2 ఎలా అవుతా? కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా సరే.. హైకమాండ్ కూడా నేను సీఎం కావాలంటే కొన్ని ఈక్వేషన్స్ చూస్తది. 

ధరణిలో జరిగిన అక్రమాల చిట్టాను ఆధారాలతో సహా బయటపెడ్తాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ధరణి పోర్టల్​లో జరిగిన అవినీతిపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. గత ప్రభుత్వం మాదిరి మేము ఫోన్ ట్యాపింగ్​లు చేయం. తాగునీరు, కరెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నరు. అయినా.. మేము అలర్ట్​గా ఉన్నం.. ఎక్కడా, ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందుకు వెళ్తున్నం’’అని తెలిపారు.

ఊహకు అందనంత భూములు కబ్జా

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఊహకు అందనంత ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆ వివరాలన్నీ త్వరలోనే ప్రజల ముందు పెడ్తామని తెలిపారు. ‘‘ఎక్కడెక్కడ.. ఎవరెవరు.. ఎంత భూమి అక్రమంగా తమ పేర్ల మీద మార్చుకున్నారో సర్వే నంబర్లతో సహా బయటపెడ్తాం. అవినీతికి పాల్పడిన వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా సరే.. వదిలే ప్రసక్తే లేదు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతం. 

బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ 23 ఎకరాలను అక్రమంగా తన పేరుమీద మార్చుకున్నట్టు ధరణి కమిటీ సభ్యుడు కోదండ రెడ్డి చెప్పారు. ఇలా చాలా మంది బీఆర్ఎస్ లీడర్లు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని తమ పేర్ల మీద మార్చుకున్నరు. వీటికి సంబంధించిన డేటా ఇప్పటికే సేకరించాం. మార్కెట్​లో ఆ భూముల విలువ ఎంత ఉంటుందో కూడా అంచనా వేశాం. 

లోక్​సభ ఎన్నికల తర్వాత జరిగే అసెంబ్లీ సెషన్​లో ధరణి, భూముల వ్యవహారంపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం’’అని పొంగులేటి ప్రకటించారు. ఇక్కడి భూములు, ఇతర మార్గాల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బులను విదేశాల్లో దాచుకున్నట్టయితే వాటిని కూడా కక్కిస్తామన్నారు. ఆ డబ్బులు వాపస్ తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలో జమ చేయిస్తామని తెలిపారు. ధరణిలో కొన్ని మార్పులు చేస్తున్నామన్నారు. భూమాత పోర్టల్ ద్వారా సమస్యల్లేని భూ రికార్డుల వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు.

వాళ్లే వచ్చి చేరుతామంటున్నరు

తాము ఇంకా గేట్లు పూర్తిగా తెరవలేదని.. ఒకవేళ తెరిస్తే మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో నేతలు ఎవరూ ఉండరని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇతర పార్టీ నేతలను కాంగ్రెస్​లోకి రావాల్సిందిగా తాము కోరడం లేదని, స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి చేరుతున్నారని చెప్పారు. గేట్లు అన్నీ ఎత్తితే.. వరదలా నేతలందరూ కాంగ్రెస్​లో చేరుతారన్నారు. 

‘‘లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమంది నేతల ఫోన్లను ట్యాప్ చేసింది. దీనిపై విచారణ జరుగుతున్నది. కాంగ్రెస్ సర్కార్ మాత్రం అలాంటి పనులు చేయదు. ఎక్కడ అధికారం కోల్పోతామని భయపడి కేసీఆర్ సర్కారు ఇష్టమొచ్చినట్టు ప్రజా సంఘాల, ప్రతిపక్షాల, మేధావుల ఫోన్లు ట్యాప్ చేయించింది. మా గవర్నమెంట్ ఐదేండ్లు ఉంటది. అలాంటి భయమేమీ లేదు’’అని పొంగులేటి అన్నారు. 

కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ.. ఎంఐఎం మద్దతు మాకే ఉన్నది

ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోయాయంటూ కొందరు నేతలు ఫొటోలు, వీడియోలు చూపిస్తూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. తమ సర్కార్ ఏర్పడిందే డిసెంబర్​లో అని.. రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీళ్లు నిల్వ ఉంచాల్సిన బాధ్యత గత ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు. ‘‘కేసీఆర్ ఏ పనీ సక్కగ చేయలేదు. 

అది తెలుసుకోక.. కొందరు బాధ్యత విస్మరించి మాపై రాళ్లు వేస్తున్నరు. కాళేశ్వరం ఫలితం ఎవరికి దక్కిందో అందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒకట్రెండు ఎంపీ సీట్లు గెలిస్తే గొప్ప. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ.. మాకు ఎంఐఎం మద్దతు ఇస్తున్నది. ఎన్నికల్లో ఏం చెప్పామో.. అదే చేస్తున్నం. గత పాలకుల అవినీతిని వెలికి తీస్తున్నం. కేసీఆర్ వల్ల ధ్వంసమైన వ్యవస్థను గాడిలో పెడ్తున్నం. దాంతో పాటు ఆరు గ్యారంటీలూ అమలు చేస్తున్నం’’అని వివరించారు. ఐదు ఎకరాలకు రైతుబంధు ఒకటి, రెండు రోజుల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు వెనుకాడబోమని తెలిపారు.