- జనం మెచ్చిన వారికే టికెట్లు
- పైరవీలు, వారసత్వానికి చోటు లేదు : మంత్రి పొంగులేటి
ఖమ్మం, వెలుగు : శివరాత్రిలోపే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఇల్లందు, ఏదులాపురం మున్సిపాలిటీలకు చెందిన ముఖ్య నేతలతో ఆదివారం ఖమ్మం క్యాంప్ ఆఫీస్‌లో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఫిబ్రవరి 15 శివరాత్రిలోపే మున్సిపల్ ఎన్నికలు, కౌంటింగ్, ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
సమయం తక్కువగా ఉన్నందున పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి.. ప్రభుత్వ అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో సర్వేలు, ప్రజాభిప్రాయమే ఫైనల్అని, పైరవీలకు తావులేదని స్పష్టం చేశారు. జనం కోరుకున్న వ్యక్తికే బీఫామ్ వస్తుందని, వారసత్వ రాజకీయాలకు చోటు లేదని, రక్తసంబంధీకులకు టికెట్లు ఇవ్వబోమన్నారు.
‘ఇప్పటికే రెండు మూడు టీమ్స్‌తో క్షేత్ర స్థాయిలో సర్వేలు చేయిస్తున్నాం.. ప్రజలు ఎవరినైతే ఆదరిస్తారో, ఎవరికైతే గెలిచే సత్తా ఉందో వారికే అవకాశం దక్కుతుంది. ఓటర్ల మనసు గెలుచుకున్న వారే అభ్యర్థులుగా బరిలోకి దిగుతారు’ అని చెప్పారు.
టికెట్ రాని వారు నిరాశ చెందవద్దని, అసంతృప్తితో ఇతర పార్టీల వైపు చూడొద్దని, వారికి సముచిత స్థానం కల్పిస్తామని, కో -ఆప్షన్ సభ్యులుగా, నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామన్నారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేయాలని ఎవరైనా రెచ్చగొడితే నమ్మి మోసపోవద్దన్నారు. సమావేశంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు.
