
ఖమ్మం జిల్లాను గత మూడు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు ముంచెత్తాయి. నాన్ స్టాప్‌గా వర్షం పడటంతో పాటు ఎగువ నుండి భారీగా వరద పొటెత్తడంతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. మున్నేరు వాగు పొంగిపొర్లడంతో ఖమ్మంలోని పలు ప్రాంతాలు జలదిగ్భంధం అయ్యాయి. లో తట్టు ప్రాంతాలు జలమయం కాగా.. పలు కాలనీలు నీటమునిగాయి. వర్షాలు, వరదలకు ప్రజలు అల్లకల్లోలం అవుతుండటంతో మంత్రి పొంగులేటి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
రూరల్ మండలం మున్నేరు పరివాహక ప్రాంతంలోని నాయుడుపేట, జలగం నగర్, దానవాయిగూడెంలో వరద ఉధృతి కారణంగా నీట మునిగిన కాలనీల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బైక్‌పై తిరుగుతూ పర్యటించారు. ఈ క్రమంలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంత్రి పొంగులేటి బైక్‌పై నుండి కింద పడగా గేర్ రాడ్ కాలికి గుచ్చకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంత్రికి చికిత్స అందించారు. మంత్రి పొంగులేటికి ఏమి కాకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.