గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టింది : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టింది : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • ఏదులాపురంను అభివృద్ధికి కృషి 
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 
  • రూ. 2.5 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఖమ్మం రూరల్, వెలుగు: గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టిందని  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో సుమారు రూ. 2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కోట నారాయణపురంలో డ్రైనేజీ పనులకు, ఎస్సీ బీసీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్లకు, అలాగే 

గుదిమళ్ల, ఇందిరమ్మ కాలనీ, నంద్యాతండా, జంగాల కాలనీల్లో డ్రైన్లు, రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి పొంగులేటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లక్షల కోట్ల కమీషన్లు వస్తాయనే ఆశతోనే గత పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టారని, కానీ పేదలకు ఇండ్లు కడితే కమీషన్లు రావనే సాకుతో ఆ పథకాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. 

తమ ప్రభుత్వం పేదవారి కష్టం తెలిసిన ఇందిరమ్మ రాజ్యమని, అందుకే అర్హులైన ప్రతి పేదవానికీ ఇండ్లతో పాటు ఇండ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని ప్రకటించారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు భరోసా కింద రూ. 12 వేలు అందిస్తున్నామని, భవిష్యత్​లో కూడా ప్రజల దీవెనలు తమ ప్రభుత్వంపై ఉండాలని ఆయన కోరారు. ఏదులాపురం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే పూర్తి బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు  తెలిపారు.