మాన‌‌‌‌వీయ కోణంలో భూ సమస్య పరిష్కరించాలి : మంత్రి పొంగులేటి

మాన‌‌‌‌వీయ కోణంలో భూ సమస్య పరిష్కరించాలి : మంత్రి పొంగులేటి
  • రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు సూచించిన మంత్రి పొంగులేటి

హైద‌‌‌‌రాబాద్, వెలుగు: దశాబ్దాల కాలంగా పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం సెక్రటేరియెట్​లో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నెలకొన్న భూ సమస్యలపై మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిన్న చిన్న సమస్యలను సాకుగా చూపించి పరిస్థితులను జఠిలం చేయొద్దని అటవీశాఖ అధికారులకు సూచించారు. 

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 40 నుంచి 50 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. అయితే.. అటవీ అధికారులు నిబంధనల పేరుతో ఆ భూములు ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​కు చెందినవని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై రెవెన్యూ, అటవీ విభాగాలు సమన్వయంతో పనిచేసి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 

ఈ సమావేశంలో మాజీ మంత్రి జానారెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్  లోకేశ్ కుమార్, నల్గొండ కలెక్టర్ ఐలా త్రిపాఠి, అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.