కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఈ కిచెన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు.
సుమారు రూ.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ కిచెన్‌లో రోజుకు 50 వేల మంది విద్యార్థులకు అల్పాహారం తయారు చేసే సామర్థ్యం ఉంది. కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 49,025 మంది విద్యార్థులకు ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు. జిల్లాలోని 17 మండలాల్లో ఉన్న 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఈ కిచెన్ ద్వారా సేవలు అందనున్నాయి.కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల పరిధిలోని విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఒకే విధమైన నాణ్యతతో, పరిశుభ్రమైన అల్పాహారం అందించేందుకు కిచెన్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
అధునాతన యంత్రాలతో వంట
కిచెన్‌లో ఇడ్లీ, దోశ, పూరీ, బోండా, సాంబార్ వంటి అల్పాహార పదార్థాలను పెద్ద మొత్తంలో తయారు చేసేందుకు ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేశారు. పాత్రలు శుభ్రం చేయడం, కూరగాయలను కడగడం, కట్ చేయడం వంటి పనులకు కూడా ఆధునిక మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.ఆహార పదార్థాల నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు ప్రత్యేక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేశారు. తయారైన అల్పాహారాన్ని థర్మల్ ఇన్సులేటెడ్ వాహనాల ద్వారా పాఠశాలలకు సకాలంలో తరలించేలా ఏర్పాట్లు చేశారు.
విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన మంత్రి
కిచెన్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. అనంతరం వారితో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. విద్యార్థులు ఆకలితో తరగతులకు రాకుండా పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. అల్పాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఏకాగ్రత, హాజరు, సమయపాలన, తరగతి గది భాగస్వామ్యం మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే వంట, ఆహార నిర్వహణ వంటి బాధ్యతల నుంచి ఉపాధ్యాయులకు ఉపశమనం కలగడంతో వారు పూర్తిస్థాయిలో బోధనపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
కోడంగల్‌లో పైలెట్ ప్రాజెక్ట్
తెలంగాణలో స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని 2024 డిసెంబర్లో కోడంగల్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. కోడంగల్‌లో ఈ కార్యక్రమం అమలు తర్వాత విద్యార్థుల హాజరు 75 శాతం నుంచి 90 శాతానికి పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని విస్తరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 కమ్యూనిటీ కిచెన్ల ద్వారా సుమారు 17.72 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించే ప్రతిపాదనలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
రోజుకో మెనూ.. రోజు విడిచి రోజు పాలు
కరీంనగర్ కమ్యూనిటీ కిచెన్‌లో సోమవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు విభిన్న రకాల అల్పాహారం అందించేలా మెనూను రూపొందించారు. రోజు విడిచి రోజు విద్యార్థులకు పాలు అందించేలా కూడా మెనూలో చేర్చారు. మెనూ రూపకల్పనలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సహకారం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్గా అమలు చేస్తోంది. ఆధునిక వంట సదుపాయాలు, నాణ్యత పరీక్షలు, ప్రత్యేక రవాణా వ్యవస్థతో ప్రభుత్వ విద్యార్థులకు సురక్షితమైన, నాణ్యమైన అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
