కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ: పొన్నం ప్రభాకర్

కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ: పొన్నం ప్రభాకర్
  • కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలుసు: మంత్రి పొన్నం
  • కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రక్షించేందుకే సీబీఐ విచారణ అని బీజేపీ అంటున్నది

హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బినామీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ‘‘కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను రక్షించేందుకే సీబీఐ విచారణను బీజేపీ అడుగుతున్నది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసు. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించాం. జ్యుడీషియల్ విచారణకు సుప్రీంకోర్టు, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జిని కేంద్రం నియమించాలి” అని డిమాండ్ చేశారు. జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని నియమించకుంటే.. కేంద్ర మంత్రి పదవికి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజీనామా చేయాలన్నారు. మంగళవారం సెక్రటేరియెట్ మీడియా పాయింట్‌‌‌‌‌‌‌‌లో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. . కేసీఆర్ ప్రతిపాదన మేరకే బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ని మార్చి రాష్ట్ర బీజేపీ చీఫ్​గా కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డిని నియమించారని ఆరోపించారు. బీజేపీని ఎదిరిస్తే సీబీఐ, ఈడీ కేసులు ఉంటాయని.. కానీ ఇందులో కేసీఆర్ కుటుంబానికి మినహాయింపు ఉంటుందని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తొత్తుగా మాట్లాడొద్దు

‘‘బీజేపీ, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ది అపవిత్ర కలయిక. వాళ్లు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు తిట్టుకుంటారో తెలియదు. కాళేశ్వరం ఏటీఎం అని బీజేపీ పదే పదే అన్నది. ‘లిక్కర్ స్కామ్’ అని కూడా చెప్పింది” అని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు తొత్తుగా మాట్లాడవద్దని, మాట్లాడే ముందే ఆలోచన చేయాలని అన్నారు. ‘‘ఆరు గ్యారంటీలు సోకులకు కాదు.. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసమే. ప్రజా పాలన దరఖాస్తులకు జనవరి 6వ తేదీనే చివరి రోజు. మళ్లీ గడువు పొడిగింపు ఉండదు” అని స్పష్టం చేశారు. ట్రక్ డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రవాణా చట్టాన్ని కొంతకాలం నిలిపివేయాలని కోరారు. ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ ట్రాప్‌‌‌‌‌‌‌‌లో పడొద్దని హెచ్చరించారు. ఓలా, ఉబర్, ర్యాపిడో, మెట్రో.. ఇవన్నీ వచ్చినప్పుడు లేని సమస్య ఇప్పుడే వచ్చిందా? అని ప్రశ్నించారు. అయినా వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.