ఆర్టీసీని ఆగం చేశారు.. ఆటో కార్మికుల పొట్టకొట్టారు: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీని ఆగం చేశారు.. ఆటో కార్మికుల పొట్టకొట్టారు: మంత్రి పొన్నం ప్రభాకర్
  • బీఆర్ఎస్​ నేతలపై పొన్నం ఫైర్
  • రూ.400 ఆటో టాక్స్​ మాఫీచేసి 10 వేల ఇన్సూరెన్స్​ రుద్దారు
  • ఓడిపోగానే వారికి నెలకు రూ.15 వేలు ఇవ్వాలని అడుగుతున్నరు
  • అలా ఇస్తే కార్మికులు ఆటోలు నడుపుకోవడం ఎందుకని ప్రశ్న

హుస్నాబాద్​, వెలుగు: గత బీఆర్ఎస్​ పాలకులు ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా, ఆటో కార్మికులపై వాహన ఇన్సూరెన్స్​ భారం మోపి వారి పొట్టగొట్టారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ విమర్శించారు. అలాంటి వాళ్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని ఆర్టీసీ బస్టాండ్​లో మేడారం, వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులతో మంత్రి మాట్లాడారు.

బస్టాండ్​లో సౌకర్యాలు, ఆర్టీసీ ఉద్యోగుల సేవలు ఎలా అందుతున్నాయని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్టీసీ కార్మికులతోపాటు అక్కడే ఉన్న ఆటో కార్మికులతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఆర్టీసీకి నష్టాలు వచ్చాయన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆటో కార్మికులు నష్టపోతున్నారని మాజీ మంత్రులు హరీశ్​రావు, కేటీఆర్​ అనడం విచిత్రంగా ఉందన్నారు.

ఆర్టీసీ బస్సులు ఇండ్ల వద్దకు వెళ్లడంలేదని, ఆటోల లోకల్​ కిరాయికి ఎక్కడా గండి పడలేదన్నారు. ఆటో కార్మికులకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని బీఆర్ఎస్​ నేతలు డిమాండ్​ చేయడం వింతగా ఉందని, అలాంటప్పుడు కార్మికులు ఆటోలు నడుపుకోవడం ఎందుకని ప్రశ్నించారు. నిజానికి ఆటో కార్మికుల పొట్టగొట్టింది గత బీఆర్ఎస్​ సర్కారే అని, రూ.400 వాహనాల టాక్స్​ రద్దు చేసి, రూ.4 వేలు ఉన్న ఇన్సూరెన్స్​ను రూ.10 వేలకు పెంచి భారం మోపారన్నారు.

తమ ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆర్టీసీ కార్మికుల పీఆర్సీ బకాయిల బాండ్స్‌‌ చెల్లింపునకు రూ.280 కోట్లు విడుదల చేశామని, అవి త్వరలోనే కార్మికులకు అందుతాయని చెప్పారు.