- మంత్రి పొన్నం ప్రభాకర్ ఏకగ్రీవ సర్పంచ్, ఉప సర్పంచులకు సన్మానం
హుస్నాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలను గురువారం హుస్నాబాద్ క్యాంప్ ఆఫీసులో మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుండడంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తున్నదని వెల్లడించారు. హుస్నాబాద్ మండలం వంగ రామయ్యపల్లి పంచాయతీలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ భూక్యా రాజేశ్వరి తిరుపతి, ఉప సర్పంచ్ దుండుగుల రాజుతో పాటు వార్డు సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మానించారు. గ్రామం ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కోసం కొత్తగా ఎన్నికైన పాలకవర్గం ఐకమత్యంతో, సమష్టిగా కృషి చేయాలని సూచించారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
బొమ్మ వెంకన్న నాకు మార్గదర్శకులు
మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న తనకు రాజకీయ మార్గదర్శకులని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వెంకన్న జయంతి సందర్భంగా నాగారం రోడ్డులో ఆయన విగ్రహానికి గురువారం మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సామాజిక న్యాయం, బలహీన వర్గాల ఉద్యమం కోసం బొమ్మ వెంకన్న చేసిన పోరాటం తనకు ప్రేరణ అన్నారు. ఈ ప్రాంతంలో కరువు సమస్యను అధిగమించేందుకు గౌరవెల్లి ప్రాజెక్ట్ సాధన కోసం వెంకన్న చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. బొమ్మ వెంకన్న ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, రైతులకు అండగా నిలబడడం తమ ప్రభుత్వ బాధ్యత అన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడంలో మరింత వేగం తీసుకొస్తామని, సామాజిక న్యాయం కోసం ఆయన నడిచిన మార్గంలోనే కొనసాగుతామని వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, ఫ్యాక్స్ చైర్మన్ శివయ్య, ఏఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి, డీసీసీ కార్యదర్శి రవీందర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పద్మ, మాజీ కౌన్సిలర్లు సరోజన, రాజు, సత్యనారాయణ, వెంకటరమణ, హాసన్, కిష్టస్వామి, రజిత, పాల్గొన్నారు.

