బీజేపీ, బీఆర్ఎస్​లది.. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ

బీజేపీ, బీఆర్ఎస్​లది.. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ

జహీరాబాద్, వెలుగు : ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అనే విధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సోమవారం జహీరాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు ఆయనను ఘనంగా సన్మానించాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి మాట్లాడారు.కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ తో ఏర్పడిన డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత పరమైన విధానాలతో నడుస్తుందని, బీజేపీ మతపరమైన అంశంతో  ఓట్లను దండుకునేందుకు చూస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ.10 లక్షల ఆరోగ్య రక్షణ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్ అమలవుతున్నాయని వివరించారు. మిగిలిన హామీలు కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. మోదీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. 

 లాభాల్లో ఆర్టీసీ

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నాశనం చేసిందని, తాము కేవలం 100 రోజుల్లోనే ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చామని పొన్నం తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ద్వారా 33 కోట్ల మంది ప్రయాణించారని వివరించారు. ఆర్టీసీ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. ఇప్పటికే వెయ్యి బస్సులను కొనుగోలు చేశామని..మరో 2 వేల బస్సులను కొనుగోలు చేస్తామన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఓ కమిటీ విచారణ చేస్తుందని నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జ్, మాజీ మంత్రి చంద్రశేఖర్,  కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేశ్ కుమార్ షట్కార్ తదితరులు పాల్గొన్నారు.