- ప్రజలతో మంత్రి పొన్నం ముఖాముఖి
- ‘పల్లెపల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెల్లో ప్రజాపాలన’కు శ్రీకారం
కరీంనగర్/సైదాపూర్, వెలుగు: ప్రజల దగ్గరికి వెళ్లడం, వారి సమస్యలు తెలుసుకోవడంతోపాటు అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కారం చూపే సరికొత్త కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. ‘పల్లెపల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెల్లో ప్రజాపాలనకు శ్రీకారం’ పేరుతో హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు. బుధవారం సైదాపూర్ మండలం దుద్దేనపల్లి, ఎక్లాస్ పూర్, సోమారం, గర్రెపల్లి, లస్మన్నపల్లి, వెన్నెంపల్లి, ఆరేపల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించారు. గ్రామంలోని సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని, అధికారుల సమన్వయంతో వెంటనే పరిష్కారం చూపారు. దుద్దెనపల్లి, వెన్నంపల్లి, ఎక్లాస్ పూర్ గ్రామాల్లో రూ.20 లక్షల చొప్పున రూ.60 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాలను ప్రారంభించారు.
173 గ్రామాల్లో పల్లెపల్లెకు పొన్నం అన్న..
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో ప్రజా పాలనకార్యక్రమం ద్వారా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని తెలిపారు. చిగురు మామిడి బీఆర్ఎస్ సర్పంచ్ ఆకవరం భవాని శివప్రసాద్, యువ నాయకులు సాయి చరణ్ మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయా కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
