1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల దోషి సజ్జన్ కుమార్ కన్నుమూత

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల దోషి సజ్జన్ కుమార్ కన్నుమూత

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ ఎంపీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషి సజ్జన్ కుమార్ (80) మరణించారు. అల్లర్లకు సంబంధించిన పలు కేసుల్లో ఢిల్లీలోని తిహార్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న సజ్జన్ కుమార్ గురువారం (ఆగస్ట్ 20) జైల్లో అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు సిబ్బంది వెంటనే అతడిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సజ్జన్ కుమార్ మరణానికి గల కారణాన్ని ఆసుపత్రి ఇంకా స్పష్టం చేయలేదు.

1984, అక్టోబర్ 31న అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఆమె సిక్కు భద్రతా సిబ్బంది దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఇందిరా గాంధీ హత్యానంతరం ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలో సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. 

కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ఈ అల్లర్లలో కీలక సూత్రధారి అని గుర్తించిన ఢిల్లీ పోలీసులు అతని మూడు కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు కేసుల్లో దోషిగా తేలిన సజ్జన్ కుమార్.. మరో కేసులో నిర్దోషిగా తేలారు. పాలం కాలనీ ప్రాంతంలో ఐదుగురి మరణాల కేసులో 2018లో ఢిల్లీ హైకోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. 

ALSO READ : బాంబే హైకోర్టు తీర్పుపై.. సుప్రీంకోర్టుకు తరుణ్ తేజ్ పాల్

అలాగే, 1984 నవంబర్ 1న ఢిల్లీలోని సరస్వతి విహార్‌లో ఇద్దరు సిక్కు పురుషుల హత్య కేసులో 2025లో హైకోర్టు సజ్జన్ కుమార్‎ను దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇక, ఢిల్లీలోని జనక్‌పురి, వికాస్‌పురిలో హింసను ప్రేరేపించిన కేసులో సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ 2026, జనవరి 22న రౌస్ అవెన్యూ కోర్టు సజ్జన్ కుమార్‎ను నిర్దోషిగా ప్రకటించింది. కానీ మరో రెండు కేసుల్లో జైవిత ఖైదు శిక్ష పడటంతో ఆయన జైలు నుంచి విడుదల కాలేదు. 

ఎవరీ సజ్జన్ కుమార్..?

1970 నుంచి దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో సజ్జన్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 1977లో కౌన్సిలర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. 1980 నుంచి మూడుసార్లు ఔటర్ ఢిల్లీ నుండి కాంగ్రెస్ తరుపుణ ఎంపీగా గెలిచారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.