సమ్మె వద్దు.. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది: మంత్రి పొన్నం

 సమ్మె వద్దు.. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది: మంత్రి పొన్నం
  • కార్మికులు, ఉద్యోగులు పునరాలోచన చేయాలి
  • ఒక్కో సమస్యను తీరుస్తూ ముందుకు సాగుతున్నం
  • తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసులో “వాహన్.. సారథి” పోర్టల్ ను ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడినపడి, లాభాల బాట పడుతున్నది.. ఈ పరిస్థితుల్లో సంస్థకు అండగా ఉండాల్సిన కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేస్తే సంస్థ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఏ సమస్య అయినా తీర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం స్పందిస్తుందని స్పష్టం చేశారు. బుధవారం సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీవో ఆఫీసులో కేంద్ర ప్రభుత్వం పోర్టల్ ‘‘వాహన్.. సారథి’’లో తెలంగాణ ప్రభుత్వం అనుసంధానమయ్యే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన మంత్రి పొన్నం, ఆ తర్వాత ఆధునికీకరించిన తిరుమలగిరి ఆర్టీవో ఆఫీసును ప్రారంభించారు. 

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఆర్టీసీ సమ్మె విషయంలో ఉద్యోగులు పునరాలోచన చేయాలి. ముందుగా ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు, నేరుగా సమ్మె అంటున్నరు. మీరంతా నా కుటుంబ సభ్యులు, సుహృద్భావ సంబంధాలతో ఆర్టీసీని రక్షించుకోవాలి” అని పిలుపునిచ్చారు. సమ్మెకు వెళ్లవద్దని మరోసారి ఉద్యోగులందరికి ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.

ప్రధాన అంశాలు సీఎం నోటీసులో ఉన్నయి

ఆర్టీసీ కార్మికుల పోరాటంతో తెలంగాణను సాధించుకున్నామని, అయితే గత పదేండ్ల పాలనలో ఆర్టీసీని ఎలా నిర్వీర్యం చేశారో కళ్లారా చూశామన్నారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో ఒక్కో పెండింగ్ సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు. కొత్త బస్సులు కొనుగోలు  చేస్తున్నామని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణ.. ప్రధాన లక్ష్యాలుగా ముందుకు పోతున్నామని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు సమ్మెకు పోవడం వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పారు.  

సీఎం రేవంత్ రెడ్డి నోటీసులో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయని, కూర్చొని వాటిపై మాట్లాడుకుందామని ట్రేడ్ యూనియన్ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ శ్రేయస్సు దృష్ట్యా ఇది సమ్మెకు పోయే సమయం అసలే కాదని స్పష్టం చేశారు. రూ.1,562 కోట్ల పీఎఫ్ బకాయిలను రూ. 600 కోట్లకు తగ్గించామని, సీసీఎస్ బకాయిలను కూడా పూర్తిగా తగ్గించామని, రిటైర్మెంట్ అయిన రోజే.. ఉద్యోగులకు  బెనిఫిట్స్ అందించే  కార్యాచరణను రూపొందిస్తున్నామని చెప్పారు. 

రాష్ట్రంలో ఇక “వాహన్..సారథి” పోర్టల్ సేవలు

తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఆధీనంలోని “వాహన్.. సారథి” పోర్టల్ తో అనుసంధానమైందని, ఇక నుంచి రవాణా శాఖను కేంద్రం.. రాష్ట్రం కలిసి నడుపుతాయని అన్నారు. ఈ పోర్టల్​ను ఎప్పుడో అమలు చేయాల్సి ఉండేదని, తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రారంభిస్తున్నామని చెప్పారు. దేశ వ్యాప్తంగా రవాణా పరమైన మార్పులు, నిర్ణయాలు, వాహనాల సమాచారం, రవాణా శాఖకు సమాచారం ఇప్పుడు రాష్ట్ర పౌరులు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.