సెలూన్లు, దోబీఘాట్లకు ఫ్రీ కరెంట్ కొనసాగింపు : పొన్నం ప్రభాకర్​

సెలూన్లు, దోబీఘాట్లకు ఫ్రీ కరెంట్ కొనసాగింపు : పొన్నం ప్రభాకర్​

హైదరాబాద్, వెలుగు: దోబీఘాట్లు, సెలూన్లు, లాండ్రీలకు ఫ్రీ విద్యుత్​ను కొనసాగించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆదేశించారు. రజకలు, నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.  2021–22 నుంచి లాండ్రీలు, సెలూన్లు, దోబీ ఘాట్లకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్​ను అందిస్తున్నదని గుర్తు చేశారు. 

 అయితే, దీనికి సంబంధించి గత ప్రభుత్వం డిస్కంలకు  బకాయిలు పడిందని చెప్పారు. వాషర్​మెన్లలో 76,060 మంది లబ్ధిదారులుండగా రూ.78.55 కోట్లు, నాయీ బ్రాహ్మణులు 36,526 మంది లబ్ధిదారులుండగా రూ.12.34 కోట్ల బకాయిలున్నాయని వివరించారు. ఈ బకాయిల చెల్లింపులకు సంబంధించి బడ్జెట్​ను విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖను కోరినట్టు మంత్రి వెల్లడించారు. లాండ్రీలు, సెలూన్లు, దోబీఘాట్లకు కరెంట్​ కనెక్షన్​కట్​ కాకుండా చూడాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులెవరూ అధైర్య పడవద్దని మంత్రి భరోసా ఇచ్చారు.