
- జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన జనం
- అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం
- ప్రజా భవన్లో అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
- ధరణి, అగ్రిగోల్డ్, భూ సేకరణ, స్పౌజ్ బదిలీలపై వినతులు
బేగంపేట, వెలుగు: ప్రజావాణికి జనం పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి మంగళవారం ఉదయమే వేలాదిగా తరలివచ్చిన ప్రజలు.. వారి సమస్యలు విన్నవించుకునేందుకు ప్రజా భవన్లో క్యూ కట్టారు. భూ సమస్యలు, స్పౌజ్ బదిలీలు, అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వానికి వారి సమస్యలు చెప్పుకున్నారు. మంగళవారం ఒక్క రోజే వివిధ సమస్యల పరిష్కారం కోసం 5,126 ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, స్టేట్నోడల్అధికారి దాసరి హరి చందన ప్రజావాణికి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొదట దివ్యాంగుల నుంచి ఫిర్యాదులను తీసుకున్న అనంతరం మెయిన్ బిల్డింగ్లో అర్జీదారుల సమస్యలు విన్నారు.
రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి బాధితులకు డబ్బు చెల్లించాలని కోరుతూ తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎన్.బాల మల్లేశ్ ఆధ్వర్యంలోని బాధితులు ప్రజావాణిలో కోరారు. శంషాబాద్ మండలం బోసెట్టి గూడ గ్రామంలో ధరణికి సంబంధించిన భూసమస్యపై పలువురు మంత్రికి విన్నవించారు. కొండ పోచమ్మసాగర్ నుంచి సంగారెడ్డి మెయిన్కాలువ రిచ్–2 భూసేకరణలో తమ విలువైన భూములు పోతున్నాయని, పనులు నిలిపివేయాలని కోరుతూ మెదక్ జిల్లా చిన్న చింతకుంటకు చెందిన రైతులు పాదయాత్రతో ప్రజావాణికి చేరుకొని ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చారు. తెలంగాణలోని13 జిల్లాల్లో స్పౌజ్బదిలీలు చేపట్టాలంటూ.. రాష్ట్ర స్పౌజ్ ఫోరం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరై వినతి పత్రం ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో తమకు నష్టం జరుగుతోందని పలువురు ఆటో డ్రైవర్లు మంత్రికి అర్జీ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన అన్ని సమస్యలపై పనిచేస్తున్నామని చెప్పారు. ఆటో డ్రైవర్లు ఆందోళన చేందవద్దని తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
సీఎం ఫొటోకు పాలాభిషేకం
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ వార్డు సభ్యుల సంఘం అధ్యక్షుడు కిన్నెర యాదయ్య ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటోకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, వార్డు సభ్యులకు అధికారాలు, మాజీ వార్డు సభ్యులకు పింఛన్ఇవ్వాలని కోరుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఫొటోకు పాలాభిషేకం చేశారు. కాగా వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు దూరప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజాభవన్ఆవరణలో తాగునీరు, మెడికల్సౌకర్యం, ఫిర్యాదుదారులకు అవసరమైన కాగితాలు సమకూర్చారు. జీహెచ్ఎంసీ కమిషనర్రోనాల్డ్రోస్సౌకర్యాలను పర్యవేక్షించారు.