- మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ
హుజూరాబాద్, వెలుగు: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి రంగాపూర్ శివారులో ప్రతిపాదించిన డంపింగ్ యార్డును రద్దు చేయాలనే డిమాండ్‌పై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. శుక్రవారం ఇల్లంతకుంట శ్రీ సీతారాముల స్వామి దేవస్థానానికి వెళ్తున్న మంత్రి, హుజూరాబాద్ అఖిలపక్ష నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి పనులు చేయబోదని, ప్రజల ఆవేదనను, విజ్ఞప్తిని పరిశీలించి కచ్చితంగా న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, కౌన్సిలర్ రవీందర్ రావు, అఖిలపక్ష కమిటీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, లీడర్లు కట్కూరు మల్లారెడ్డి, జనార్దన్, సమ్మయ్య, రత్నం, హరిప్రసాద్ తదితరులు ఉన్నారు.
