భవిష్యత్తులోనూ సీపీఐతో కలిసి వెళ్తాం : పొన్నం ప్రభాకర్

భవిష్యత్తులోనూ సీపీఐతో కలిసి వెళ్తాం : పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ విజయంలో సీపీఐ సంపూర్ణ సహకారం ఉన్నదని, భవిష్యత్తులో కూడా తాము కలిసే ముందుకెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యార్థి ఉద్యమాల నుంచి తనకు కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి సంఘాలతో అనుబంధం ఉందని గుర్తుచేశారు. శుక్రవారం సీపీఐ నాయకులను కలిసేందుకు మానకొండూరు ఎమ్మెల్యే కె.సత్యనారాయణతో కలిసి ఆయన మగ్దుంభవన్ కు​వచ్చారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి, ఇతర నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ సర్కారులో ప్రజా సమస్యలను చెప్పడానికి వచ్చిన ప్రతిపక్ష నేతలకు కూడా అవకాశం ఇవ్వలేదని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాసమస్యలను వినేందుకు ప్రజాదర్బార్ ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయంతో రాష్ట్రంలో ప్రజాస్వామిక పునాది పడిందన్నారు. 

ప్రజల ఆశలు వమ్ము చేయొద్దు: కూనంనేని 

ప్రజల ఆశలు, ఆశయాలను కాంగ్రెస్​ సర్కారు వమ్ము చేయొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం  ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. శాసనసభలో అన్ని కమ్యూనిస్టు పార్టీల తరఫున పీడిత, బాధిత వర్గాల ప్రజల పక్షాన తాను నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తానని చెప్పారు. హుస్నాబాద్ లో కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉన్నదని, తమ పార్టీ మద్దతుతో పొన్నం ప్రభాకర్ విజయం సాధించారని పేర్కొన్నారు.

జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకిచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోను అమలు చేయాలని సూచించారు. అనంతరం సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు.