- స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
- సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో మంత్రి పొన్నం
రాజన్నసిరిసిల్ల, వెలుగు: కాంగ్రెస్పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు పదవులొస్తాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలో డీసీసీ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ప్రభుత్వం బతుకమ్మ చీరలకు సంబంధించి బకాయిలు పెట్టిపోతే కాంగ్రెస్ప్రభుత్వం వచ్చాక చెల్లించామన్నారు.
సిరిసిల్లలో కాంగ్రెస్ బలంగా ఉందని పేర్కొన్నారు. సంగీతం శ్రీనివాస్ పార్టీ కోసం పని చేశారని, లాఠీ దెబ్బలు తిన్నారని చెప్పారు. పార్టీ అధిష్టానం ఆయన సేవలను గుర్తించి, డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టిందన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హన్మంతరావు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల దమ్మేందో చూపెట్టాలని సూచించారు.
సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. బీసీలకు కాంగ్రెస్ సముచిత స్థానం కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్చొప్పదండి ప్రకాశ్, నాయకులు గడ్డం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
