- కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించాలి: మంత్రి పొన్నం
- ఉప్పల్, ఆరంఘర్లో కొత్తగా బస్టాండ్లు
- ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీకి టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే కాకుండా ఇతర మార్గాల ద్వారా ఇన్ కమ్ వచ్చే మార్గాలను గుర్తించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియెట్లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ క్రమంగా లాభాల బాటలోకి వచ్చినా, ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించాలన్నారు. బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపం ద్వారా వస్తున్న ఆదాయం, ఖర్చులపై మంత్రి ఆరా తీశారు.
మరింత ఆదాయం పెంచుకోవాలని సూచించారు. ‘‘ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా 237 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారు. దీంతో ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.7,980 కోట్లు చెల్లించింది. ఆర్టీసీ టికెట్లపై అడ్వర్టయిజ్మెంట్ లు ముద్రించి వాటి ద్వారా ఆదాయం రాబట్టుకోవాలి. నష్టాల్లో ఉన్న తాండూరు, వికారాబాద్, కుషాయిగూడ, దిల్‌సుఖ్ నగర్, హకీంపేట, రాణిగంజ్, మిథాని ఆర్టీసీ డిపోలపై అధ్యయనం చేయడానికి ఓ కమిటీ నియమించాలి. రద్దీ ఉండే రూట్లలో బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలి. కొత్త రూట్లలో సర్వీసులు నడిపితే ఆదాయం వస్తది. ఫోర్త్ సిటీలో బస్ టెర్మినల్ ఏర్పాటు, సౌకర్యాల కల్పనపై స్టడీ చేయాలి’’అని మంత్రి సూచించారు.
విడతల వారీగా త్వరలో 2వేల బస్సులు
ఆరాంఘర్, ఉప్పల్లో జూబ్లీ బస్టాండ్ తరహాలో బస్టాండ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. ‘‘ఇప్పటికే సిటీలో 500 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. పీఎం ఈ డ్రైవ్ కింద హైదరాబాద్ కు కేటాయించిన మరో 2వేల బస్సులు విడతల వారీగా సేవల్లోకి రానున్నాయి. వీటికి అనుగుణంగా చార్జింగ్ స్టేషన్లను పెంచి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇప్పటికే వెయ్యి డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులకు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ చివర్లో 84 ట్రాఫిక్ సూపర్ వైజర్, 114 సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తాం. మేడారం జాతర కోసం ములుగు బస్టాండ్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలి.
వారంలో కోదాడ, హుజుర్ నగర్ బస్టాండ్లకు శంకుస్థాపన చేస్తాం’’అని పొన్నం తెలిపారు. ఆర్టీసీలో బస్సు ప్రమాదాలు తగ్గించడానికి తొలి దశలో లహరి, రాజధాని, గరుడ బస్సుల్లో అమలవుతున్న డ్రైవర్ మానిటరింగ్ సిస్టం పనితీరును సమీక్షించారు. ఈ విధానంతో బస్సు డ్రైవర్ కు నిద్ర వచ్చినా, మొబైల్ చూసినా అలారంతో అప్రమత్తం చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం దీని పనితీరుపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తెలుసుకునేందుకు త్వరలోనే జూమ్ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మేడారం జాతర కోసం 3,800 బస్సులు నడిపేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. సమీక్ష సమావేశంలో రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
