ఉద్యోగులను వేధించొద్దు

ఉద్యోగులను వేధించొద్దు

    సమస్యలను సానుకూలం పరిష్కరించాలి

     ఆర్టీసీ అధికారులకు మంత్రి పువ్వాడ ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగులను వేధించొద్దని, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని అధికారులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌‌కుమార్‌‌ ఆదేశించారు. ప్రతి మంగళవారం ఆర్టీసీ ఉద్యోగుల వినతుల పరిష్కారానికి దృష్టి సారించాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌‌లోని తన చాంబర్​లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. సీఎం కేసీఆర్‌‌ ఇచ్చిన హామీలపై ఈడీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీలో ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించడంతోపాటు ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆయన సూచించారు. ఓడీ, మెడికల్‌‌ గ్రౌండ్‌‌, సెలవుల కోసం వచ్చే వినతులపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఉద్యోగుల వినతులను మూడు విభాగాలుగా చేసి, వాటిని ప్రాధాన్యతా  క్రమంలో పరిష్కరించాలని తెలిపారు. బస్సుల్లో బాధ్యతగా టికెట్‌‌ తీసుకోవడంపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఆర్టీసీ ఎండీ సునీల్‌‌ శర్మ, ఈడీలు పురుషోత్తం, వినోద్‌‌ కుమార్‌‌, టీవీరావు, యాదగిరి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సీఎం హామీల అమలేది?

సీఎం కేసీఆర్‌‌ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంట వెంటనే ఎందుకు అమలు చేయడంలేదని అధికారులపై మంత్రి పువ్వాడ అజయ్‌‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉద్యోగ భద్రతకు సంబంధించి ఇంకా విధివిధానాలు ఎందుకు రెడీ చేయలేదని, వెల్ఫేర్‌‌ కౌన్సిల్‌‌ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారంలో ఆలస్యం ఏందని ప్రశ్నించినట్లు సమాచారం. కార్గో సేవలు ఇంకా ప్రారంభం కాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉద్యోగ భద్రతపై వారం రోజుల్లోగా విధివిధానాలను తయారు చేసి ఇవ్వనున్నట్లు ఈడీలు తెలిపారు.