
- ఇప్పటివరకు ఎటువంటి కార్యకలాపాలు జరపలేదు: వైష్రాయ్ రీసెర్చ్
- వేదాంత రిసోర్సెస్‌కు ఫండ్స్ మళ్లించడానికే దీనిని ఏర్పాటు చేశారు
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్-సెల్లర్ వైష్రాయ్ రీసెర్చ్ వేదాంత గ్రూప్‌పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ గ్రూప్ మొదలు పెట్టిన సెమీకండక్టర్ బిజినెస్ వేదాంత సెమీకండక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (వీఎస్‌పీఎల్) ను నకిలీ కమోడిటీస్ ట్రేడింగ్ కంపెనీగా ఆరోపించింది. ఇది సెమీకండక్టర్ వ్యాపారం చేయడం లేదని కాపర్, సిల్వర్, గోల్డ్ వంటి ట్రేడింగ్ చేసే కంపెనీగా మారిందని, ఈ కార్యకలాపాలన్ని పేపర్ మీదే జరిగాయని, రియల్‌గా జరగలేదని పేర్కొంది. ముంబై బేస్డ్ వేదాంత లిమిటెడ్ (వీఈడీఎల్) తన పేరెంట్ కంపెనీ వేదాంత రిసోర్సెస్‌కు డబ్బులు అందించడంలో భాగంగా ఈ కంపెనీని ఏర్పాటు చేసింది.
వైష్రాయ్ రిపోర్ట్ ప్రకారం, వేదాంత లిమిటెడ్, వేదాంత సెమికండక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య లోన్లు ఇచ్చి పుచ్చుకోవడం జరిగింది. వీఎస్‌పీఎల్ ఎన్‌సీడీల ఇష్యూ ద్వారా సుమారు రూ.2,500 కోట్లు సేకరించింది. ఈ ఫండ్స్‌ను వీఈడీఎల్‌కు ఇచ్చింది. లోన్లు ఇచ్చి పుచ్చుకోవడంలో ఎన్‌బీఎఫ్‌సీ కేటగిరీ కింద రాకుండా ఉండేందుకు వీఎస్‌పీఎల్‌ను ఏర్పాటు చేశారని ఆరోపణ. ఎన్‌బీఎఫ్‌సీ ఏర్పాటు చేయాలంటే తగినంత క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. ఆర్‌బీఐ రూల్స్ ఫాలో కావాలి. అందుకే నకిలీ కంపెనీ వీఎస్‌పీఎల్‌ను ఏర్పాటు చేశారని వైష్రాయ్ చెబుతోంది. కాగా, వేదాంత రిసోర్సెస్ కిందటేడాది ఏప్రిల్‌లో తీవ్ర లిక్విడిటీ సంక్షోభాన్ని ఎదుర్కొంది.
ఆధారం లేని ఆరోపణలు..
వేదాంత ఈ ఆరోపణలను “ఆధారా లేనివి”గా తోసిపుచ్చింది. వీఎస్‌పీఎల్, వీఈడీఎల్ మధ్య లోన్‌లు చట్టబద్ధంగా, పారదర్శకంగా జరిగాయని, ఆడిటెడ్ ఫైనాన్షియల్స్‌తో ఉన్నాయని పేర్కొంది. వైష్రాయ్ ఈ ఏడాది జులై 9న లేవనెత్తిన ఆరోపణలపై వేదాంత క్లియర్‌గా స్పందించలేదు.