మరోసారి బీఆర్ఎస్​ను గెలిపించాలి: పువ్వాడ అజయ్ కుమార్

మరోసారి బీఆర్ఎస్​ను గెలిపించాలి: పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం టౌన్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మంలోని 12వ డివిజన్ రాధాకృష్ణ నగర్ శ్రీతులసి వనంలో అపార్ట్​మెంట్​లో పోలవరపు శ్రీకాంత్, మన్నే కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అజయ్ పాల్గొని మాట్లాడారు. ఖమ్మంలో చేసిన అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని సూచించారు. 

మరోసారి తనను గెలిపిస్తే ఇంతకు రెండింతల అభివృద్ధిని చూస్తామన్నారు. అనంతరం వీడీఓఎస్ కాలనీలోని క్యాంప్​ఆఫీసులో 68 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 42 మందికి బీసీ బంధు, 26 మందికి మైనార్టీ బంధు చెక్కులను పంపిణీ చేశారు. 8వ డివిజన్ వైఎస్సార్ నగర్​లో నిర్మించిన 91 డబుల్ బెడ్ రూమ్​ఇండ్లు, గవర్నమెంట్​స్కూల్​బిల్డింగ్​ను మంత్రి అజయ్ ప్రారంభించారు. రఘునాథపాలెం మండలంలో పరికలబొడు తండా, మల్లేపల్లి, రాములు తండా, బావాజీ తండా, జింకల తండా గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

మంత్రికి నిరసన సెగ

అర్హుల లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో 15 మంది వైఎస్సార్​నగర్​లో ఆందోళనకు దిగారు. ఇండ్ల పంపిణీకి వచ్చిన మంత్రి అజయ్​కాన్వాయ్​ను అడ్డుకున్నారు. పోలీసులు వారిని పక్కకు లాగిపడేశారు. మంత్రి అనుచరులు ఆందోళనకారులను పిడిగుద్దులు గుద్దుతూ నెట్టివేశారు. ఘర్షణలో 5 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు జావీద్, కార్పొరేటర్ సైదులు పరామర్శించారు. అర్బన్ తహసీల్దార్ స్వామి స్పందిస్తూ.. 91 ఇండ్లకు గాను 68 మందిని ఎంపిక చేశామని, రీ వెరిఫికేషన్ చేసి మరికొందరికి ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు.