అక్కడ ఉంది రీల్ సింహం కాదు.. జ"గన్

అక్కడ ఉంది రీల్ సింహం కాదు.. జ"గన్

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఏపీ రాజకీయాలు రోజురోజుకీ హీటెక్కుతున్నాయి. సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించి రోజులు గడుస్తున్నా ఆ మంట మాత్రం ఇంకా తగ్గడం లేదు. మంత్రి రోజా, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "బాలయ్య ఫ్లూటు బాబు ముందు ఊదు... జ‌గ‌న్ అన్న ముందు కాదు" అంటూ సినిమా పంచ్ లతో రోజా ట్విట్టర్ వేదికగా ఏరిపారేశారు. "అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ"గన్" అనే రియల్ సింహం" అంటూ సింహం ఎమోజీని జోడించారు. దీంతో పాటు "తేడా వస్తే దబిడి దిబిడే..!!" అంటూ బాలయ్య డైలాగ్ ను ఆయనకే విసురుతూ రోజా సెటైరికల్ కామెంట్స్ చేశారు. దీనికి ఇటీవల బాలయ్య చేసిన ట్వీటే కారణం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించిన బాలకృష్ణ... "మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదని, ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక" అని నిప్పులు చెరిగారు. అంతే కాదు.. "ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు" అంటూ ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. బాలయ్య చేసిన ట్వీట్ పై ప్రస్తుతం మంత్రులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే రోజా.. బాలయ్యపై ఈ విమర్శలు చేశారు.

మొన్నటికి మొన్న ఇదే విషయంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందనపైనా సర్వత్రా చర్చ సాగింది. "వైఎస్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ సమాన స్థాయి నేతలు.. ఒకరి పేరు తీసి మరో పేరు పెట్టినంత మాత్రాన వారి కీర్తి ప్రతిష్టలు తగ్గవు" అంటూ ట్వీట్ చేయడంతో.. ఇక రచ్చకు బ్రేక్ పడినట్టే అయ్యింది. నందమూరి కుటుంబ నుంచే ఆ రియాక్షన్ రావడంతో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఫలితం లేనట్టే అని అంతా వివాదాన్ని పక్కనపెట్టారు. ఆ తర్వాత బాలయ్య చేసిన కామెంట్లతో ఇప్పుడు మంత్రులంతా మండిపడుతున్నారు.