అపాయింట్ మెంట్ ఇవ్వగానే గవర్నర్ ను కలుస్తాం : సబితా ఇంద్రారెడ్డి

అపాయింట్ మెంట్ ఇవ్వగానే గవర్నర్ ను కలుస్తాం : సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అపాయింట్ మెంట్ ఇవ్వగానే వెళ్లి కలుస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. గవర్నర్​ ను కలవమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు ఆదేశాలు వచ్చాయని తెలిపారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్​ నుంచి లేఖ వచ్చిందన్నారు. ఇప్పటికే గవర్నర్​ అపాయింట్​మెంట్​ కోరామని, ఇంకా తేదీ ఖరారు కాలేదన్నారు. అపాయింట్ మెంట్ ఇవ్వగానే గవర్నర్​ తమిళి సైను కలిసి ఆమె సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పారు. 

అంతకుముందు.. తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై రాజ్ భవన్ కు వచ్చి చర్చించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గవర్నర్ ఆదేశించారు. ఈనెల 7వ తేదీన సబితా ఇంద్రారెడ్డికి, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై యూజీసీ అభిప్రాయం కోరారు. ఈ బిల్లు చెల్లుబాటు అవుతుందో లేదో తెలియజేయాలని సూచించారు. మూడేళ్లుగా యూనివర్శిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని లేఖలో గవర్నర్ ప్రశ్నించారు. 

మరోవైపు.. తెలంగాణ అసెంబ్లీ, మండలిలో ఇటీవల ఆమోదించిన 7 బిల్లులు ప్రస్తుతం గవర్నర్ తమిళిసై వద్ద పెండింగ్ లో ఉన్నాయి. అందులో యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు కూడా ఉంది. దీన్ని ఆమోదించడం వల్ల ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తాయా..? అలా జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందో చెప్పాలని, రిక్రూట్ మెంట్ పై వివరణ ఇవ్వాలని మంత్రి సబితకు గవర్నర్ సూచించారు. 

ఇంకోవైపు.. యూనివర్శిటీల్లో కామన్ రిక్రూట్ మెంట్ బిల్లు తనకు అందలేదన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలను రాజ్ భవన్ వర్గాలు ఖండించాయి. ఈ బిల్లుపై సోమవారం మెసెంజర్ ద్వారా సమాచారం ఇచ్చామని రాజ్ భవన్ అధికారులు మంగళవారం స్పష్టం చేశారు.