టీచర్లకేమైంది.. జీతాలు పెంచినం కదా? 

టీచర్లకేమైంది.. జీతాలు పెంచినం కదా? 
  • వాళ్లు క్షోభపడుతున్నట్లు బీజేపీ ప్రచారం చేయడం సరికాదు: మంత్రి సబిత

హైదరాబాద్,వెలుగు:“టీచర్లకేమైంది.. జీతాలు పెంచినం కదా! తెలంగాణలోని ఉద్యోగులకు, టీచర్లకు దేశంలో ఎక్కడా లేని విధంగా జీతాలు పెంచినం. వారి గౌరవాన్ని కాపాడేలా ప్రభుత్వం పనిచేస్తున్నది. టీచర్లు మానసిక క్షోభపడుతున్నట్లు బీజేపీ నేతలు ప్రచారం చేయడం సరికాదు” అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్​పర్సన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు సర్కారు బడులను సందర్శించి, విద్యార్థులకు స్వాగతం పలకాలని ఆమె కోరారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్​లు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, చైర్​పర్సన్లు బడుల్లో పారిశుధ్యం, నీటి వసతులపై  దృష్టి పెట్టాలన్నారు. ఆదివారం హైదరాబాద్​లో మంత్రి సబిత మీడియాతో మాట్లాడారు. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు. మొదటి విడతలో ఖర్చుచేసే రూ.3,497 కోట్ల నిధుల్లో.. రూ. 2,700 కోట్లు కేంద్ర నిధులంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. సంజయ్​  దగ్గర ఆధారాలుంటే నిరూపించాలని ఆమె సవాల్  విసిరారు.

నెల రోజులు బ్రిడ్జి కోర్సు మాదిరిగా.. 
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం క్లాసులు ప్రారంభిస్తున్నట్టు మంత్రి సబిత చెప్పారు. దీనికోసం 1.04 లక్షల టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చామని, నెల రోజుల పాటు బ్రిడ్జి కోర్సు మాదిరిగా క్లాసులు నిర్వహించాలని టీచర్లకు సూచించామని తెలిపారు. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన బడిబాటలో భాగంగా ఇప్పటి వరకు 70,698 మంది పిల్లలు సర్కారు బడుల్లో చేరారని మంత్రి వివరించారు. మన ఊరు మన బడి ప్రోగ్రామ్​లో భాగంగా 9,123 బడుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు బండి సంజయ్ అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని, ఆ మాటలు మానుకోవాలని మంత్రి అన్నారు. ఒక పక్క టెట్ వాయిదా వేయాలంటూ మరోపక్క 20 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటూ సంజయ్ ద్వంద్వనీతితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే విద్యారంగంలో రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయం గురించి ప్రధాని మోడీతో మాట్లాడాలన్నారు. అన్ని రాష్ట్రాలకు వివిధ విద్యాసంస్థలను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణలో మాత్రం నవోదయలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐటీలు, ఐఐఎంలు, మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని దుయ్యబట్టారు.