మేడారంకు జాతీయ హోదా ఇయ్యాలె

మేడారంకు జాతీయ హోదా ఇయ్యాలె

బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని మంత్రి సత్యవతి రాథోడ్‌‌ డిమాండ్‌‌ చేశారు. మేడారం జాతరకు జాతీయ హోదా ఇచ్చి, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలన్నారు. గిరిజనుల ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌‌లోని గిరిజన మ్యూజియంలో కుమ్రం భీమ్, రాంజీ గోండులపై నిర్మించిన డాక్యుమెంటరీలను ఆమె ప్రారంభించారు. బీజేపీ నేతలు అబద్ధాలతో ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరని సత్యవతి అన్నారు. అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ గిరిజన, దళితులను కేంద్రం అణచివేస్తోందని విమర్శించారు. బిర్సా ముండా, కుమ్రం భీమ్, రాంజీ గోండుల దారిలో గిరిజన అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని చెప్పారు. గిరిజన మ్యూజియానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన మహాసమ్మేళనంగా ఖ్యాతికెక్కిన జాతర మేడారం సమ్మక్క-సారక్క. ఈ జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.  ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా.