జనవరి 15 వరకు మేడారం పనులు పూర్తి చెయ్యాలె

జనవరి 15 వరకు మేడారం పనులు పూర్తి చెయ్యాలె

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/ఏటూరునాగారం, వెలుగు: మేడారం మహా జాతర పనులన్నీ జనవరి 15లోపు పూర్తి చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆఫీసర్లను ఆదేశించారు. జాతరలో పాల్గొనే భక్తులు మెచ్చేలా శాశ్వతమైన ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. బుధవారం మేడారంలో మంత్రి ముందుగా సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో రూ.75 కోట్లతో చేపట్టిన పనులను పరిశీలించారు. జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు కావల్సిన స్నానఘట్టాలు, దుస్తుల మార్పిడి గదులు, ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలు, భక్తుల వసతి సౌకర్యాలను ఆ ప్రాంతమంతా తిరిగి పర్యవేక్షించారు. అనంతరం అక్కడ జరుగుతున్న పనులపై జిల్లా కలెక్టర్‌‌‌‌ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన ఆఫీసర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈసారి కరోనా ప్రభావం మరింతగా పెరుగుతుందని వస్తున్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో హెల్త్ డిపార్ట్​మెంట్ సేవలు కీలకమన్నారు. భక్తులు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి  జాతరకు వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. గత జాతరలో అన్ని ఏర్పాట్లు బాగా చేసినా కరెంట్​వైర్​తెగి ఒక గర్భిణి చనిపోయిందన్నారు. ఈసారి చిన్న ఘటన కూడా జరగకుండా ఆఫీసర్లు చూసుకోవాలన్నారు. 

పనుల్లో క్వాలిటీ పాటించాలె
ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ మేడారం జాతర పనులలో క్వాలిటీ పాటించాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు పసుపు, కుంకుమ, బంగారాన్ని ప్రసాదంగా ఇవ్వాలన్నారు. కొవిడ్ రూల్స్​పాటిస్తూ  మెడికల్ అధికారులు అవేర్నెస్ కల్పించాలని అన్నారు. జాతర వరకు రోడ్లను పూర్తి చేయాలని చెప్పారు. అందరం కలిసికట్టుగా జాతరను విజయవంతం చేద్దామన్నారు. జడ్పీ చైర్​పర్సన్​కుసుమ జగదీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రతి పైసా మనదేనని, పనులు నాణ్యతగా చేపట్టాలన్నారు. ప్రతి రెండేండ్లకు ఒక్కసారి జరిగే మేడారం జాతరలో శాశ్వత  పనులు  చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ పై అధికారుల  ఆదేశాలు పాటిస్తూ జనవరి మొదటి వారంలోగా పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు.