గిరిజన, బంజారాల అభివృద్ధికి కేసీఆర్​ కృషి: సత్యవతి రాథోడ్

గిరిజన, బంజారాల అభివృద్ధికి  కేసీఆర్​ కృషి: సత్యవతి రాథోడ్

నర్సాపూర్, వెలుగు : తండాలను పంచాయతీలు చేసి, గిరిజన, బంజారాల అభివృద్ధికి సీఎం కేసీఆర్​ కృషి చేశాడని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం పట్టణంలో జరిగిన గిరిజన బంజారాల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీత రెడ్డి, లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. కేసీఆర్​ ప్రభుత్వం తండాలను పంచాయతీలు చేయడం వల్ల భారీ సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు ఎన్నికయ్యారన్నారు. సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు 4 శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్లు 10% పెంచారన్నారు.  80 గిరిజన గురుకులాలను ఏర్పాటు చేయడంతో పాటు బంజారాహిల్స్ లో బంజారా భవనాన్ని నిర్మించారన్నారు.

మరోసారి బీఆర్ఎస్ ను గెలిపిస్తే లంబాడీల అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. నర్సాపూర్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డికి గిరిజనలు అండగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సునీత రెడ్డిలు మాట్లాడుతూ.. తండాల అభివృద్ధికి సీఎం కేసీఆర్​ సాయంతో మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మండలంలోని నాగులపల్లి, మూసాపేట్, రుస్తుంపేట్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్, జిల్లా కో ఆప్షన్ నెంబర్ మన్సూర్ అలీ, రాష్ట్ర నాయకులు రమేశ్​నాయక్, శ్రీధర్ గుప్తా, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్​లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.