మంత్రి సత్యవతి రాథోడ్​ ఎదుట.. ఒంటిపై పెట్రోల్​ పోసుకున్న​వృద్ధుడు

మంత్రి సత్యవతి రాథోడ్​ ఎదుట.. ఒంటిపై పెట్రోల్​ పోసుకున్న​వృద్ధుడు
  • తన తండ్రి చనిపోతే జాబ్​ ఇవ్వలేదని ఒంటిపై పెట్రోల్​ చల్లుకున్న ​సలీం
  • అడ్డుకుని లాక్కెళ్లిన పోలీసులు
  • 36 ఏండ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన  
  • వీఆర్ఏల నియామక పత్రాల  పంపిణీ సందర్భంగా ఘటన  

మహబూబాబాద్,వెలుగు: మహబూబాబాద్​జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్ ​వీఆర్​ఏలకు నియామక పత్రాలు అందజేస్తుండగా ఓ వృద్ధుడు పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. పోలీసులు అడ్డుకుని పక్కకు లాక్కెళ్లడంతో ప్రమాదం తప్పింది. వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా, గురువారం ఏబీ గార్డెన్స్​లో మంత్రి సత్యవతి 360 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. 

వేదికపై మంత్రి ఉండగానే వచ్చిన నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన 65 ఏండ్ల షేక్​ సలీం ఒంటిపై పెట్రోల్​చల్లుకుని ‘నాకు న్యాయం చేయాలి..నాకు న్యాయం చేయాలి’ అంటూ అరవడం మొదలుపెట్టాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అడ్డుకుని బయటకు లాక్కెళ్లారు. అక్కడ సలీం మాట్లాడుతూ తన తండ్రి హుస్సేన్​ 1986లో గ్రామ వీఆర్​ఏగా పని చేస్తూ చనిపోయాడని, అప్పటి నుంచి తన తండ్రి ఉద్యోగం ఇవ్వాలని తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. 65 ఏండ్ల తన జీవితంలో 36 ఏండ్లు తిరగడానికే సరిపోయిందన్నారు.

 ఈ విషయమై కోర్టుకు పోయానని వారు అధికారులను కలవాలని ఆదేశాలిచ్చారని, తనకు చదువు లేదనే కారణంతో పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. 2010 నుంచి తన అక్క కొడుకు షేక్​యాకూబ్​ను కాంట్రాక్ట్​పద్ధతిపై కొనసాగించారని, తన ఫిర్యాదుతో గత ఏడాది తొలగించారన్నారు. కానీ, కొంత మంది రెవెన్యూ ఆఫీసర్లు అతడితో కుమ్మక్కై మళ్లీ అతడికే ఉద్యోగం ఇచ్చారన్నారు. తన వయస్సు ఎలాగూ అయిపోయిందని, కనీసం తన బిడ్డకయినా జాబ్​ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ విషయంపై మంత్రి స్పందించలేదు. తర్వాత ప్రోగ్రామ్ ​యథావిధిగా కొనసాగింది.