కొత్త గురుకులాలు, స్టడీ సెంటర్ల ఏర్పాటుపై మంత్రి సత్యవతి సమీక్ష

కొత్త గురుకులాలు, స్టడీ సెంటర్ల ఏర్పాటుపై మంత్రి సత్యవతి సమీక్ష

హైదరాబాద్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గిరిజన గురుకులాల విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ సంవత్సరం ఏర్పాటు చేయనున్న నూతన గురుకులాలు, స్టడీ సెంటర్ల ఏర్పాటుపై హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. 

ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగుల భర్తీ చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరికొన్ని స్టడీ సర్కిల్స్ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి సత్యవతి అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, నాణ్యమైన భోజనం వడ్డించాలని కోరారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలని ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలు, దుప్పట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలతో పాటు ఇతర సౌకర్యాలన్నీ అందేలా చూడాలని ఆదేశించారు. 10వ తరగతి వరకూ విద్యను అందిస్తున్న గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ వరకూ విద్యను అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలియజేశారు. 

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, ప్రైవేట్ రంగాల్లో కావాల్సిన నైపుణ్యాల కోసం స్టడీ సెంటర్లలో శిక్షణ అందించేలా ప్రణాళికను రూపొందించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు. ప్రతి స్టడీ సర్కిల్ లో ఫ్యాకల్టీ ఏర్పాటుతోపాటు, కంప్యూటర్లు, అత్యధిక సాంకేతిక మౌలిక వస్తువులను సమకూర్చాలని ఆదేశించారు. రాజేంద్రనగర్ లోని ఐఐటీ జేఈఈ ఎంసెట్ కోచింగ్ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం, పరిగి, హయత్ నగర్, వరంగల్ లో ఈ ఏడాది కోచింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ నిర్ణయాలని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.