
- పూజారుల సూచనలను పాటిస్తూ ముందుకెళ్లాలి: మంత్రి సీతక్క
- మేడారం మాస్టర్‌ప్లాన్‌పై ఉన్నతాధికారులతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: ఆదివాసీల ఆచారాలు, సంప్రదాయాలు ఉట్టిపడేలా మేడారం ఆలయ పరిసరాలను తీర్చిదిద్దాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. పూజారుల సలహాలు, సూచనలు పాటిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్లాలన్నారు. శనివారం సెక్రటేరియెట్‌లో మేడారం మాస్టర్ ప్లాన్ పై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, ములుగు కలెక్టర్ దివాకర్ టీఎస్, సమ్మక్క– సారలమ్మ జాతర పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సిద్ధబోయిన అరుణ్ కుమార్ తో మంత్రి సీతక్క రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆదివాసీల విశ్వాసాలను గౌరవించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. సమ్మక్క–సారలమ్మ గద్దెలు, ఎంట్రెన్స్, క్యూలైన్ల డిజైన్లను సిద్ధం చేసి పూజారుల ఆమోదం తీసుకోవాలన్నారు. ఆదివాసీల సంప్రదాయాల ప్రకారం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజు వరుసలో ఉండేలా చూడాలన్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కోర్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాతర ప్రారంభానికి ముందు మాస్టర్ ప్లాన్‌లోని తొలి దశ పనులు పూర్తి చేస్తామన్నారు.
‘స్వచ్ఛదనం.. పచ్చదనం’ విజయవంతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క కోరారు. శనివారం సెక్రటేరియెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ సృజనతో కలిసి డీపీవోలు, డీఆర్డీవోలు, సీఈవోలతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. స్వచ్ఛదనం.. పచ్చదనం కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏడు కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామని, నర్సరీల్లో దాదాపు తొమ్మిది కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని, కార్యక్రమంపై రోజువారీ నివేదిక అందజేయాలని అధికారులకు సూచించారు. గ్రామస్థాయిలో పకడ్బందీగా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నారు.