- పల్లెల అభివృద్ధికి కట్టుబడి ఉన్నం: అసెంబ్లీలో మంత్రి సీతక్క
- వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా మిషన్ భగీరథకు రూ.400 కోట్లు
- మహిళా సంఘాలకు రూ.4,019 కోట్లు ఎగ్గొట్టిన కేసీఆర్ సర్కారు
- మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం రూ.318 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పల్లెల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, గ్రామాల్లో పనుల జాతర నడుస్తున్నదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. పంచాయతీల్లో పెండింగ్ బిల్లుల పాపం బీఆర్ఎస్ దేనని, వారి పాపాలకు మాజీ సర్పంచ్‌లు బలికావద్దని కోరారు. ఇప్పటికే రూ.318 కోట్ల పెండింగ్ బిల్స్ క్లియర్ చేశామని, విడతల వారీగా మిగిలిన బిల్లులు చెల్లిస్తామన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా మిషన్ భగీరథకు రూ.400 కోట్లు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ.4,019 కోట్లు ఎగ్గొట్టిందని సీతక్క ఫైరయ్యారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల పద్దులపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. బడ్జెట్ పద్దులు విస్తృత చర్చ అనంతరం ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. సభలో సభ్యులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అమలు విధానం, నిధుల వినియోగం వంటి అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మాజీ సర్పంచ్ల విషయంలో బీఆర్ఎస్ చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయని, పెండింగ్ బిల్లులు రాక, వడ్డీలు కట్టలేక పలువురు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పాలనలో సర్పంచుల కష్టాలు అన్ని ఇన్ని కావన్నారు. తమ సర్కారు మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లలు చెల్లిస్తూనే ఉన్నదని, ఇప్పటికే రూ.318 కోట్ల బిల్స్ చెల్లించామని మంత్రి పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధికి రూ. వేల కోట్లు విడుదల చేశాం
గ్రామాల అభివృద్ది కోసం ప్రజా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. 2023-–24 లో రూ. 318 కోట్లను విడుదల చేసి మాజీ సర్పంచ్ లు, ఇతర కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించామని తెలిపారు. 2024–-25లో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,280 కోట్లు రాగా వీటితో కలిపి స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్స్ (ఎస్ఎఫ్సీ) రూ.611 కోట్లు, 2025–-26లో స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్స్ రూ.400 కోట్లను జీపీలకు విడుదల చేశామన్నారు.
ఈ ఏడాది సుమారు రూ.2,199 కోట్ల వ్యయంతో మొత్తం లక్షకు పైగా పనులకు శ్రీకారం చుట్టి గ్రామాల సమగ్రాభివృద్ధికి బలమైన పునాది వేసినట్లుగా తెలిపారు. మిషన్ భగీరథ గ్రిడ్ లో అంతరాయం జరిగితే గ్రామాల్లోని చేతి పంపులు, సింగల్ ఫేజ్, త్రీ ఫేజ్ మోటార్లు, ఓపెన్ వెల్స్ ద్వారా తాగు నీటి సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలకు ఎక్కడా తాగు నీటి సమస్య రాకుండా చూస్తున్నామన్నారు.
ఐదేండ్లలో లక్ష కోట్ల రుణాలు ఇవ్వడమే లక్ష్యం
స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో స్త్రీనిధి 13వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. స్త్రీనిధి సాధించిన ప్రగతిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పేలా మరిన్ని సంస్కరణలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
రైజింగ్ తెలంగాణలో భాగంగా ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా రాబోయే ఐదేండ్లలో మహిళలకు రూ.లక్ష కోట్ల రుణాలు అందిస్తామని, తద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే సర్కార్లక్ష్యమని తెలిపారు. మహిళలే సొంతంగా స్థాపించుకున్న తొలి ఆర్థిక సంస్థ స్త్రీనిధి అని, ప్రస్తుతం రూ.5,500 కోట్ల రుణ నిల్వతో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు. రాజస్తాన్, మేఘాలయ వంటి రాష్ట్రాలు మన నమూనాను అనుసరిస్తుండటం గర్వకారణమని పేర్కొన్నారు.
ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థల అధిక వడ్డీల భారానికి మహిళలు గురికావద్దని, బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి ద్వారానే రుణాలు పొందాలని సూచించారు. మన స్త్రీనిధి యాప్‌ద్వారా మారుమూల గ్రామాల మహిళలు కూడా సులభంగా లోన్లకు దరఖాస్తు చేసుకోవచ్చునని, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా ఈఎంఐ చెల్లించే సౌకర్యం కల్పించినట్టు వెల్లడించారు. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి రూ.154 కోట్ల నికర లాభాన్ని గడించిందని, సభ్యులకు 14 శాతం డివిడెండ్ ప్రకటిస్తున్నామని వివరించారు.
