
- ఇయ్యాల్టి నుంచి నెలరోజుల పాటు
- అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీ కేంద్రాలకు గురువారం నుంచి నెల రోజుల పాటు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. తల్లిదండ్రులు, అంగన్ వాడీ యూనియన్ల విజ్ఞప్తి మేరకు మహిళా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఆదేశాల మేరకు అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమీర్ పేట వెంగళరావునగర్ లోని కమిషనరేట్ లో బుధవారం అంగన్ వాడీ యూనియన్ నేతలతో డైరెక్టర్ కాంతి వెస్లీ సమావేశమయ్యారు. అనంతరం సెలవులు ప్రకటించారు.
ఎండలు మండుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలవుల్లో కూడా అంగన్ వాడీ పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు గుడ్లు, సరుకులు అందిస్తామని డైరెక్టర్ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ నెల రోజులు అంగన్ వాడీ టీచర్లు ఇంటింటి సర్వే, ఇండ్లకు వెళ్లి ఆరేండ్ల లోపు పిల్లలను అంగన్ వాడీ కేంద్రాల్లో చేర్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డైరెక్టర్ ఆదేశించారు. సెలవులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి యూనియన్లు ధన్యవాదాలు తెలిపారు.
కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లకు గుడ్ న్యూస్
ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల్లో పనిచేస్తున్న సీఆర్టీలు (కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు)లకు 21 రోజుల సమ్మెకాలంకు వేతనాలు, మరణిస్తే అంత్యక్రియల కోసం రూ.30 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను ఐటీడీఏల నుంచి చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ శరత్ కు 2వేల టీచర్ కుటుంబాలు, తెలంగాణ అశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ టీచర్ సంఘం నేతలు ధన్యవాదాలు తెలిపారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ అంధుల, బధిరుల ఆశ్రమ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో, వైకల్యాన్ని ఎదిరించి విద్యార్థులంతా ఉత్తీర్ణులు కావటం అభినందనీయమని, ఇతర విద్యార్థులకు వీరు ఆదర్శమన్నారు.