
- మనుధర్మాన్ని ఆదివాసీలపై రుద్దేందుకు యత్నం
- ఆదివాసీ ఏరియాల్లో రోడ్లు, ఇండ్ల స్థలాలకు కేంద్రం పర్మిషన్ ఇవ్వట్లేదని ఫైర్
- ఆదివాసీలు రాజకీయాల్లో రాణించాలి: వివేక్ వెంకటస్వామి
- అంబేద్కర్ కల్పించిన హక్కులను కాపాడుకుందామని పిలుపు
- కాంగ్రెస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ప్రతినిధులకుముగిసిన శిక్షణ శిబిరం
జన్నారం, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఈ కుట్రను ఆదివాసీ బిడ్డలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారంలో కాంగ్రెస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ప్రతినిధుల శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వనవాసీ పేరుతో మనుధర్మాన్ని ఆదివాసీలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఆదివాసీలది ఏడు తరాల చరిత్ర అని, ఆ అస్థిత్వాన్ని ఆదివాసీలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలికే ప్రధాని మోదీ.. ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్లు, ఇండ్ల స్థలాలకు పర్మిషన్లు ఇవ్వడం లేదు. కానీ అడవులు, గుట్టలపై మైనింగ్ కోసం మాత్రం అనుమతులిస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులమతాల పేరుతో ప్రజలను రెచ్చగొడ్తున్న కేంద్ర ప్రభుత్వం.. గత 12 ఏండ్లలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ స్లాబ్ ప్లాన్, ఐటీడీఏలను గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తున్నదని ఫైర్ అయ్యారు.
ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నం
ఏఐసీసీ ఎస్సీ సెల్ నేషనల్ ప్రెసిడెంట్కొప్పుల రాజు మాట్లాడుతూ.. ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక గుర్తింపునిస్తున్నదని, వాళ్లు రాజకీయంగా ఎదిగేందుకు ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు వినోద్, వెడ్మ బొజ్జు, ఏఐసీసీ ఆదివాసీ శిక్షణ ప్రోగ్రామ్ కన్వీనర్ రాహుల్ భల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ విశ్వప్రసాద్, నిర్మల్డీసీసీ ప్రెసిడెంట్శ్రీహరిరావు, ట్రైకర్ చైర్మన్ బెల్లయ్య నాయక్, జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: వివేక్
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కల్పించిన హక్కులను కాపాడుకుంటూ ఆదివాసీలు, గిరిజనులు ఆర్థికంగా, రాజకీయంగా రాణించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అంబేద్కర్ మంచి మార్గం చూపారు. పేదల అభ్యున్నతి కష్టమని భావించి, వారి కోసం ప్రత్యేకంగా హక్కులు కల్పించారు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ రాజ్యాంగాన్ని మార్చాలని, పేద ప్రజల హక్కులను తొలగించాలని కుట్రలు చేశాయి. ఈ కుట్రలను గుర్తించిన ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు సరైన గుణపాఠం చెప్పారు” అని అన్నారు. ‘‘ఆదివాసీలు, గిరిజనులకు చట్టాలపై అవగాహన కల్పిచేందుకు ఇలాంటి శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయి.
ఆదివాసీలు రాజకీయంగా ఎదగడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇది ఉపకరిస్తుంది. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. ప్రతిపక్షాల వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలి” అని వివేక్ పిలుపునిచ్చారు. పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయికి చేరుకునేలా తీర్చిదిద్దాలని ఆదివాసీలకు సూచించారు. 1971లో గరీబీ హటావో నినాదం ఇచ్చిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ.. ఎస్సీ, ఎస్టీలకు భూములు, ఇండ్లు పొందే హక్కు కల్పించారని, పేదల సంక్షేమంలో ఆమె ఆదర్శంగా నిలిచారని వివేక్ తెలిపారు.