నెక్లెస్ రోడ్ లోని సరస్ ఫెయిర్ - 2024 బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క కేటీఆర్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ట్వీట్ల పేరుతో చాటుచాటుగా కాకుండా డైరెక్ట్ గా వచ్చి మాట్లాడాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు సీతక్క. ప్రజల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ప్లాట్లు అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం, కష్టం, నిజాయితీ ముందు నువ్వెంత అంటూ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు సీతక్క. రాహుల్ గాంధీని అనే స్థాయి కేటీఆర్ ది కాదని అన్నారు.
బీసీ, ఎస్టీ మంత్రులుగా ఆర్థిక నేపథ్యంతో కాకుండా.. స్వతంత్రంగా ఎదిగామని.. సమ్మక్క సారలమ్మ, రాణి రుద్రమ్మ ప్రాంతాల నుంచి వచ్చిన తమ మీద అక్కసు ఎందుకని ప్రశ్నించారు. వరదల్లో మునిగి ప్రజలు నష్టపోవద్దని ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజల ఇళ్లను కూలగొట్టి బుల్డోజర్ ప్రభుత్వం నడిపారని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలే స్వచ్చందంగా తమ ఇళ్లను కూల్చేసుకుంటున్నారని అన్నారు. పేదలకు నష్టం రాకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ చెప్పారని అన్నారు.
గత మాజీ మహిళా మంత్రుల చరిత్ర.. ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసని అన్నారు సీతక్క. తాము నామినేట్ చేస్తే అప్పనంగా వచ్చినోళ్లం కాదని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ మంత్రులమని అన్నారు.సినిమా యాక్టర్లకు తాము వ్యతిరేకం కాదని.. వాళ్ళను ద్వేషించడం లేదని స్పష్టం చేశారు.