కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం : మంత్రి సీతక్క

కోటి మంది మహిళలను  కోటీశ్వరులను చేస్తాం : మంత్రి సీతక్క
  • వడ్డీలేని రుణాలతో మహిళలకు ఏంతో మేలు
  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి‌ శాఖ మంత్రి సీతక్క
  • భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పర్యటించిన మంత్రి

జయశంకర్‌‌ భూపాలపల్లి/ చిట్యాల/ ములుగు/ వెంకటాపూర్‌‌(రామప్ప), వెలుగు: 'రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉక్కు మహిళా ఇందిరమ్మ స్పూర్తితో ముందుకు సాగుతాం. రాష్ట్రంలో పేదరికం ఉండొద్దంటే మహిళల చేతిలో డబ్బులు ఉండాలి. మహిళలు లేకుంటే సమాజంలో పురోగతి ఉండదు' అని పంచాయతీ రాజ్‌‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు.  మహిళల పేరుపైనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, బ్యాంకు రుణాలు ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులిచ్చి ఆ ఇంటికి ఓనర్లుగా మహిళలను చేస్తున్నామన్నారు. 

శుక్రవారం భూపాలపల్లి జిల్లా చిట్యాల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ఫ్ ఆధ్వర్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధ్యక్షతన జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబురాల కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అంతకుముందు ములుగు జిల్లా వెంకటాపూర్‌‌, చల్వాయి మండలాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్దికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. 

మహిళా సంఘంలో సభ్యులకు వడ్డీ లేకుండానే బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నామని, మహిళలు సరికొత్త ఆలోచనలతో నూతన వ్యాపారాలు చేపట్టి అభివృద్ధి చెందాలని సూచించారు. సంఘంలో సభ్యులుగా ఉన్న మహిళ మరణిస్తే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. 60 ఏండ్లు దాటిన మహిళలను, తల్లిదండ్రులు లేని 16 ఏండ్లు నిండిన యువతులను సంఘంలో చేర్చుతున్నామన్నారు. అమ్మచేతి వంటకు కేరాఫ్ అడ్రస్ ఇందిర మహిళా శక్తి అని, అందుకే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 6 బస్సులు ఆర్టీసీకి మహిళా సంఘాల ద్వారా ఇచ్చామని, ప్రతి నెలా ఒక్కో బస్సుకు రూ.70 వేలు ఆర్టీసీ చెల్లిస్తున్నట్లు తెలిపారు. మహిళలు మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువుల వ్యాపారాలు చేసేందుకు శిక్షణ ఇస్తామన్నారు.  

వంద ఎకరాల్లో సోలార్‌‌ ప్లాంట్‌‌..

భూపాలపల్లి జిల్లా నైన్‌‌పాకలోని వంద ఎకరాల సర్కారు భూమిలో సోలార్‌‌ ప్లాంట్‌‌ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మహిళలకు మండలానికి ఒకటి చొప్పున బస్సు ఇస్తున్నామన్నారు. మహిళా సంఘాల పేరున పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 6,700 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెల్లించామని, అలాగే ఆరోగ్యశ్రీ కవర్​కానీ 1,100 మందికి ఉచిత వైద్య సేవలు అందించామని తెలిపారు. గాంధీనగర్ వద్ద ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌‌ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌ రాహుల్‌‌ శర్మ, సెర్ఫ్ డైరెక్టర్ రజని, అడిషనల్​ కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఆర్డీవో బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

రేషన్‌‌కార్డు ప్రొసీడింగ్స్​ పంపిణీ...

ములుగు జిల్లా వెంకటాపూర్‌‌ మండలంలోని లక్ష్మీదేవిపేట పంచాయతీలో కొత్తగా మంజూరైన రేషన్‌‌ కార్డు ప్రొసీడింగ్స్​ను మంత్రి సీతక్క లబ్ధిదారులకు అందించారు. వెంకటాపూర్ మండలం అడవి రంగాపూర్ లో రూ.3.5 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌‌ స్టేషన్‌‌ పనులను ప్రారంభించారు. గోవిందరావుపేట మండలం చల్వాయిలో పామాయిల్ పంట సాగు చేస్తున్న రైతులకు మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. బూర్గుపేట మారేడుగొండ చెరువు నుంచి నీటి విడుదలను చేశారు. 

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ ప్రభుత్వం అండగా నిలిచి వివిధ పంటలు పండిస్తున్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని, పామాయిల్ పంట సాగుతో రైతు పెట్టుబడి తక్కువ పెట్టి ఎక్కువ ఆదాయం పొందవచ్చన్నారు. అంతకుముందు ములుగు కలెక్టరేట్​లో మంత్రి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, పోషకాహరం అందేలా ఉపాధ్యాయులు, వార్డెన్లు, సంక్షేమ అధికారులు చర్యలు తీసుకోవాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ తదితరులు పాల్గొన్నారు.