- మంత్రి సీతక్క
ములుగు, వెలుగు : జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. గురువారం ములుగులో రూ.కోటీ 50 లక్షలతో ముస్లిం కమ్యూనిటీ హాల్, రూ.50 లక్షలతో సైన్స్, కంప్యూటర్ ల్యాబ్ లు, రూ.15 లక్షలతో తెలంగాణ గెజిటెడ్ భవనం, రూ.10 లక్షలతో నాన్ గెజిటెడ్ భవనం, గట్టమ్మ సమీపంలో రూ.3.62 కోట్లతో నిర్మించనున్న 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.61లక్షలతో బండారుపల్లి జంక్షన్ వద్ద చేపట్టిన ఐ లవ్ములుగు లోగో, సుందరీకరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తాను చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆడబిడ్డగా ఆదరించాలని కోరారు.
గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నిధుల కొరత కారణంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేయలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతూ పూర్తి స్థాయిలో పనులు చేపడతానని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో రూ.50 కోట్లతో రోడ్లు నిర్మించామని, మరో రూ.50 కోట్లు మంజూరు చేయించి మిగతా పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని కులాల దేవతలు కొలువుదీరిన ఆలయాలకు ప్రత్యేక నిధులను కేటాయిస్తామన్నారు. ఇప్పటికే ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద రామప్ప శిల్పాలతో కూడిన సింబల్ ను ఏర్పాటు చేశామన్నారు.
అదే తరహాలో ములుగులో ఐ లవ్ ములుగు పేరుతో సింబల్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ములుగు జిల్లాను టూరిజం హబ్ గా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ములుగులో షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంలో మంత్రి సీతక్క ఉర్దూలో మాట్లాడి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
